సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నర్సులను కించపరిచానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, దీన్ని తాను ఖండిస్తున్నానని తెలిపారు. రోగులకు సేవలు అందించే నర్సు సోదరీమణులంటే తనకెంతో గౌరవం అని బాలకృష్ణ అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశానని.. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవమని బాలకృష్ణ అన్నారు. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని బాలయ్య అన్నారు. కరోనా వ్యాప్తి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలు అందించారన్నారు. నిజంగా తన మాటలు మీ మనోభావాలను దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని అన్నారు.
అన్‌స్టాపబుల్ సీజన్‌లో ప్రసారమైన పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌లో తనకు యాక్సిడెంట్ జరిగిన విషయం గురించి బాలకృష్ణ వివరిస్తున్న సందర్భంలో నర్సు ప్రస్తావన వచ్చింది. అప్పుడు బాలకృష్ణ మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని.. క్షమాపణలు చెప్పాలని నర్సుల సంఘం డిమాండ్ చేసింది.