సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియలు ఈరోజు బుధవారం జరగనున్నాయి. పద్మాలయా స్టూడియోలో కడసారి చూపుకు ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. ఇప్పటికే కృష్ణకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. నందమూరి బాలకృష్ణ కృష్ణ పార్థివ దేహాన్ని దర్శించి నివాళులు అర్పించారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ సినిమా కెరీర్ పరిశీలిస్తే ఎన్నో సాహసాలకు, ప్రయోగాలకు మారు పేరు. చలన చిత్ర రంగానికి ఎనలేని సేవలు చేశారు. మొదటి కౌబాయ్ సినిమా, మొదటి సినిమా స్కోప్ సినిమా, మొదటి 70 ఎం.ఎం సినిమా, మొదటి డి.టి.ఎస్ సౌండ్ సిస్టమ్ మూవీ ఇలా చాలా టెక్నికల్ అంశాలను తెలుగు సినిమాకు అందించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ రాణించారు. పద్మాలయా స్టూడియోను స్థాపించారు. సాంఘిక, జానపద, చారిత్రాత్మక .. ఇలా అన్నీ చిత్రాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం దక్కించుకున్నారు కృష్ణ అని బాలయ్య చెప్పుకొచ్చారు. నాన్నగారు, కృష్ణగారే ఇండస్ట్రీకి బంగారు గుడ్లు పెట్టే బాతులు. నిర్మాతలకు అండగా నిలిచారు. ఆర్థికంగా సాయపడ్డారు. కొత్త దర్శకులను పరిచయం చేశారు. నేను కృష్ణగారితో కలిసి సుల్తాన్ సినిమాకు పని చేశాను. ఆ సమయంలో ఎప్పుడూ ఆయన నాన్నగారి గురించే చెబుతుండేవారు. నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకున్నానని ఆయన చెప్పారు. భావి నిర్మాతలకు నాన్నగారైతేనేమి, కృష్ణగారైతేనేమి స్ఫూర్తిగా నిలిచారు. కృష్ణగారి సేవలను గుర్తించి ఎన్నో అవార్డులను ఇచ్చారు. 350 పైచిలుకు చిత్రాల్లో నటించారు. నాన్నగారిని చూసి ఇంత అందమైన వాడు.. ఇంత మంచి మనిషి ఎక్కడైనా పుట్టాడా అంటుండేవాడిని. ఇప్పుడు అలాగే కృష్ణగారిలా అందంగా ఎవరైనా పుట్టారా అనిపిస్తుంది. కారణజన్ముడు. ఆయన ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటిగా దుర్ఘటనలు సంభవించాయి. వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి. కృష్ణగారిలాంటి వ్యక్తులను జీవితాంతం మరచిపోలేమని నందమూరి బాలకృష్ణ అన్నారు.