సుమారు ఒకటిన్నర నిమిషాల నిడివి గల వీడియోలో ఇస్లామిక్ ప్రార్థనలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. అహ్మదాబాద్‌లోని సరస్సు సమీపంలోని పార్క్ లో కొంతమంది బురఖా ధరించిన మహిళలు, మరికొందరు పురుషులు ఇస్లామిక్ నమాజ్‌లను చేశారు. ఈ వీడియో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
సమాచారం అందుకున్న విశ్వహిందూ పరిషత్ (VHP)కి చెందిన సభ్యులు సోమవారం (నవంబర్ 15) సాయంత్రం శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. తోటలో గంగా జలం చల్లి, హనుమాన్ చాలీసా పఠించారు. అహ్మదాబాద్‌లోని లేక్ పార్క్‌ను వీహెచ్పీ సభ్యులు శుద్ధి చేశారని గుజరాత్ వీహెచ్పీ కార్యదర్శి అశోక్ రావల్ ధృవీకరించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఇలా చేశామని రావల్ తెలిపారు. నమాజ్ తరచుగా చేయడాన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారని తెలిపారు.

మీడియా నివేదికల ప్రకారం.. వస్త్రపూర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ ఇన్‌ఛార్జ్ అధికారి సందీప్ ఖంబ్లా మాట్లాడుతూ ఈ విషయంలో ఎటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడలేదని తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు చేసిన శుద్దీకరణ కార్యక్రమంపై ఎవరూ పోలీసులను సంప్రదించలేదని తెలిపారు. నమాజ్ చేసిన వ్యక్తుల సమూహం మరియు దానిని వీడియో తీసిన వారి గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదు. లేక్ పార్క్ సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన వారి బంధువులను చూడటానికి వచ్చిన వాళ్ళే అక్కడ నమాజ్ చేశారని అంటున్నారు. ఇటీవలి కాలంలో బహిరంగ ప్రదేశాలలో నమాజ్ చేస్తున్న ముస్లింలను ప్రజలు అడ్డుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి.