మరోసారి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నమ్ముకుంటున్న కాంగ్రెస్

0
741

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆయన రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ వచ్చారు. అప్పుడప్పుడు ఆయన పేరు వినిపించేది తప్పితే ప్రభుత్వాల మీద తీవ్ర విమర్శలు.. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రెస్ మీట్లు పెట్టినట్లుగా పెద్దగా కథనాలు కూడా రాలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దేశ వ్యాప్తంగా సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ పలువురు నేతలను ఢిల్లీకి ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీకి రమ్మని పిలిచింది. ఆయన కూడా వెళ్లిపోయారు. ఈ కీలక పరిణామాల కారణంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సరికొత్త లీడర్ రాబోతున్నారని అంటున్నారు.

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం నాడే ఢిల్లీకి చేరుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. జై సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశాడు 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున అభ్యర్ధులను కూడా కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దింపారు. అయితే ఒక్క అభ్యర్ధి కూడా విజయం సాధించలేదు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ ఇంచార్జీ బాధ్యతలు చేపట్టాలని కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోరుతుందనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ తర్వాత ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీ రాష్ట్ర పీసీసీ చీఫ్ బాధ్యతలను చేపట్టాలని కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎఐసీసీలో కిరణ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు.