ముంచెత్తిన వరుణుడు

0
797

ఉమ్మడి నల్లగొండ జిల్లాను వరుణుడు ముంచెత్తాడు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ఉమ్మడి నల్లగొండ జిల్లాను అతలాకుతలం చేస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలోనే వరుణదేవుడు రైతుల పాలిట శాపంగా మారాడు. మరోవైపు కుండపోతగా కురుస్తున్న వానలకు జిల్లా జలాశయాలన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి.

ఉపరితల ఆవర్తనంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చేతికొచ్చిన పంట రైతుల కళ్ల ముందే నీటిపాలవుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాలో దాదాపుగా 60శాతం ప్రజల జీవన ఆధారం వ్యవసాయం. కానీ భారీ వర్షాలు రైతులకు ఈ ఏడాది నిరాశే మిగిల్చింది. వరి కోతకు వచ్చే సమయంలో వరుణుడు కన్నేర చేయడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. పత్తి సాగు చేసిన రైతులకు ఈ సంవత్సరం ముందుగా మురిపించిన వరుణుడు ఆ తర్వాత మోహం చాటేశాడు. అయినా ఎన్నో ఇబ్బందులతో పత్తి పంటను కాపాడుకున్న రైతులకు ఈ అకాల వర్షాలు దెబ్బతీశాయి. పత్తి తీసేటైంలో ఈ వానలు ఎంతో నష్టం చేశాయి. దీంతో ఉమ్మడి జిల్లా రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది.

భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు మళ్లీ నిండుకుండను తలపిస్తున్నాయి. నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం గరిష్టస్థాయికి పెరగడంతో సాగర్ 18 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 4లక్షల 812 క్యూసెక్కులు కాగా, ఔట్‎ఫ్లో 4లక్షల 812 క్యూసెక్కులు. పూర్తిస్దాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు.. ప్రస్తుతం 311.1486 టీఎంసీలుగా నీరు నిల్వ ఉంది.

అటు సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 6 క్రస్ట్ గేట్లను 2అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 7వేల 789.13 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 7వేల 184.95 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 643.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు అయితే ప్రస్తుత నీటి నిల్వ 4.17 టీఎంసీలు ఉంది.

పులిచింతల ప్రాజెక్టుకు వరద పెరిగింది. 15గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 171.45 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు అయితే ప్రస్తుత నీటి నిల్వ 40.4448 టీఎంసీలుగా ఉంది.

ఎడతెరిపిలేని వర్షాలతో ఉమ్మడి జిల్లా ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రవాణ వ్యవస్థకు కొన్ని చోట్ల ఆటంకం కల్గింది. ఆయకట్టు ప్రజలంతా ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కబిక్కు మంటూ గడుపుతున్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

two × one =