కాంగ్రెస్‌కు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయ్. నాయకత్వ లోపాల కారణంగా సీనియర్లు సైతం ఓవైపు పార్టీని వీడుతుంటే.. మరోవైపు ఇప్పుడు ‘రాజ్యసభ’ చిచ్చు మరికొందరిలో తీవ్ర అసంతృప్తిని రాజేస్తోంది. తాజాగా మాజీ నటి, కాంగ్రెస్ నేత నగ్మా కాంగ్రెస్‌పై బహిరంగంగానే వ్యతిరేక పోస్ట్ చేశారు.
సోనియా జీ.. కాంగ్రెస్ చేరిక సమయంలో రాజ్యసభ సీటును నాకు ఇస్తామని ఆఫర్ చేశారు. 2003 నాటికి కాంగ్రెస్ అధికారంలో లేదు. అప్పటి నుంచి 18 ఏళ్ల పాటు అవకాశం కోసం ఎదురు చూడడంతోనే సరిపోయింది. ఇప్పుడు ఇమ్రాన్ ను మహారాష్ట్ర నుంచి పెద్దల సభకు పంపిస్తున్నారు. అసలు నాకు ఆ అర్హతే లేదా? అని నగ్మా ట్విటర్ ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేశారు.
మా 18 ఏళ్ల తపస్సు కూడా ఇమ్రాన్ భాయ్ ముందు వెనుకబడి పోయింది అంటూ ఓ ట్వీట్‌లో వైరాగ్యం ప్రదర్శించారు ఆమె. ఇదిలా ఉంటే.. జూన్ 10న జరగబోయే రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఏడు రాష్ట్రాల నుంచి పది మంది సభ్యులతో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్ నుంచి రాజీవ్ శుక్లా, రంజిత్ కుమార్, హర్యానా నుంచి అజయ్ మాకెన్, మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్ ప్రతాప్‌ఘడి, కర్ణాటక నుంచి జైరామ్ రమేష్, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ తన్హా, తమిళనాడు నుంచి చిదంబరం, రాజస్థాన్ నుంచి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తావారి పేర్లను ప్రకటించింది. ఇక బీజేపీ ఎనిమిది రాష్ట్రాల నుంచి 16 మందికి సీట్లు ఖరారు చేసింది. వీరిలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, నిర్మలా సీతారామన్ సైతం ఉన్నారు.