మొత్తానికి అధికార టీఆర్ఎస్ పార్టీ.., ఇటు బీజేపీల వ్యూహ ప్రతివ్యూహాల మధ్య నాగార్జున సాగర్ ఉపఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. ఈ రెండు పార్టీలు కూడా అభ్యర్థును ప్రకటించడంలో పూర్తిస్థాయిలో గోపత్యను ప్రకటించాయి. టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ సీనియర్ నేతలైన కోటిరెడ్డి, తేర చిన్నపరెడ్డి, దివంగత నోముల నరసింహ్మయ్య కుమారుడు భగత్..పార్టీ టిక్కెట్ కోసం పోటీ పడ్డారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అంతర్గతంగా సర్వేలు చేయించారని తెలుస్తోంది. పార్టీ పరంగా అభ్యర్థి ఎవరైతే నాగార్జునసాగర్ లో గెలుపు అవకాశాలుంటాయనే దానిపై ఇంటలెజిన్స్ అధికారుల నుంచి సైతం సమాచారం తెప్పించుకున్నా తర్వాత ఓ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.
ముఖ్యంగా నోముల మరణం తర్వాత నియోజకవర్గంలో ఏర్పడిన సానుభూతి, అలాగే నియోజకవర్గంలోని 35 వేలకు పైగా యాదవ సామాజిక వర్గం ఓట్లు…, ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్దిపొందుతున్నవారి సంఖ్యను బేరిజు వేసుకున్న తర్వాతే సీఎం కేసీఆర్ నోముల కుమారుడు భగత్ కు ఓకే చెప్పారని చెబుతున్నారు.
అలాగే టీఆర్ఎస్ టిక్కెట్ కోసం చివరి వరకు ప్రయత్నం చేసిన కోటిరెడ్డి, తేర చిన్నపరెడ్డిలను టీఆర్ఎస్ అధిష్ఠానం బుజ్జగించినట్లు సమాచారం. చిన్నపరెడ్డి ఎమ్మెల్సీ పదవీ కాలం వచ్చే ఏడాది జనవరిలో ముగియనుంది. మరోసారి ఆయనకు అవకాశం ఇస్తామని సీఎం కేసీఆర్ మాట ఇచ్చారని అంటున్నారు. అలాగే కోటిరెడ్డికి నామినేటేడ్ పదవీని, లేదంటే మండలి సభ్యత్వం ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు టీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా నోముల భగత్ పేరును సోమవారం ప్రకటించడంతో…ఇటు బీజేపీ కూడా తమ అభ్యర్థి ఎవరనే విషయంపై.., పార్టీ సీనియర్ నేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపింది. అనేక తర్జనభర్జనల మధ్య…అన్ని పార్టీల కంటే ఆలస్యంగా సోమవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత చివరకు డాక్టర్ రవి నాయక్ ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.
రవి నాయక్ ఎంపిక విషయంలో బీజేపీ సామాజిక సమీకరణాల లెక్కలు వేసుకుందని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి సాగర్ నియోజకవర్గంలో ఎస్టీల మొదటి నుంచి కూడా నిర్ణయాత్మక శక్తిగా వ్యవహారిస్తూ వస్తున్నారు. వారి తర్వాత స్థానంలో యాదవులు ఉన్నారు. గత ఎన్నికల్లో ఇద్దరు యాదవ అభ్యర్థులే బరిలో నిలిచినప్పుడు కూడా ఎస్టీల మద్దతు పొందిన అభ్యర్థులే గెలుపొందారు. అధికార టీఆర్ఎస్ యాదవ కులానికి చెందిన నోముల భగత్ కు టిక్కెట్ ఇవ్వడంతో., బీజేపీ కూడా వ్యూహాత్మంగా లంబాడా కులానికి చెందిన రవి నాయక్ ను బరిలోకి దింపిందని అంటున్నారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో లంబాడా ఓటర్లు 34 వేలకు పైగా ఉన్నారు. నల్గొండ జిల్లా గుర్రంపాడు గ్రామంలో గిరిజనుల భూములను కాపాడాలంటూ బీజేపీ చేసిన ఉద్యమం ఈ ఉపఎన్నికలో తమకు కలిసి వస్తుందని కమలం నేతలు భావిస్తున్నారు. గిరిజన భూముల కోసం ఉద్యమించిన బీజేపీకి చెందిన 40 మంది కార్యకర్తలను అరెస్టు చేసి నాన్ బెయిలబుల్ పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ సమయంలో స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దిగి గుర్రంపోడు గ్రామానికి వెళ్లారు. అక్కడి గిరిజనులతో మమేకం అయ్యారు. ఇది వారిలో మరింత స్థైర్యాన్ని నింపింది. బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా బీజేపీ గిరిజన నాయకులను వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు బండి సంజయ్. దీంతోపాటు… ఇప్పుడు ఏకంగా ఒక జనరల్ స్థానం నుంచి ఎస్టీ అభ్యర్థికి పోటీ చేసేందుకు పార్టీలు టిక్కెట్ ఇవ్వడమనేది చాలా అరుదు. అలాంటిది సాగర్ లో బీజేపీ ఒక ఎస్టీ లంబాడా వ్యక్తికి టిక్కెట్ ఇవ్వడం లాభిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
అలాగే ఎస్టీలతోపాటు, ఈ నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గానికి సైతం గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. ఈ నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గం ఓట్లు 25 వేలకు పైగా ఉండగా, మాలల ఓట్లు 7వేల పైచిలుకు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా తమకు అనుకూలంగా పడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన నివేదితారెడ్డి, ఈసారి కూడా పార్టీ టికెట్ ఆశించారు. పార్టీ అభ్యర్థిని ఇంకా డిక్లేర్ చేయక ముందే ఆమె నామినేషన్ కూడా వేశారు. ప్రచార రథాన్ని సైతం సిద్ధం చేసుకున్నారు. అటు కడారి అంజయ్య యాదవ్ , అలాగే సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి కూడా పార్టీ టిక్కెట్ ఆశించారు.
అయితే సామాజిక సమీకరణాల ఆధారంగా టిక్కెట్ ను రవి నాయక్ కు కేటాయించడంతో… , నిరాశకు గురైన కడారి అంజయ్య ను అధికార టీఆర్ఎస్ బుట్టలో వేసుకుందనే ప్రచారం జరుగుతోంది. ఆయనతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలా శేఖర్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, సైదిరెడ్డి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అంజయ్య కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు రెడీ కావడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన్ను కేసీఆర్ సమక్షంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్త కథనాలు ప్రసారం అయ్యాయి. కడారి అంజయ్య ను తీసుకుని మొదట ప్రగతి భవన్ వెళ్లిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు…, అక్కడ సీఎం కేసీఆర్ లేరనే విషయం తెలుసుకుని , అక్కడి నుంచి అంజయ్యను సీఎం ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లారు.
ఇక కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి కూడా ఉపఎన్నికల బరిలో నిలిచారు. అధికార టీఆర్ఎస్… ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా తమకు నచ్చినవారికి ఓటు వేసుకునే స్వేచ్ఛను ఇవ్వాలన్నారు జానారెడ్డి. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి పునాదులు వేసేలా…. నామినేషన్ వేసిన తర్వాత అధికార టీఆర్ఎస్, అలాగే బీజేపీ అభ్యర్థులు ప్రచారాలకు పోకుండా ఉండేందుకు ముందుకు వస్తే తాను సైతం ప్రచారం చేయనని.., ప్రజలే తమ అభ్యర్థి ఎవరు అని నిర్ణయిస్తారని జానా చెప్పుకొచ్చారు.ఈ నియోజకవర్గంలో రెడ్డిల ఓట్లు 24వేలకు పైగా ఉన్నాయని, రెడ్డి ఓట్లతోపాటు, మిగిలిన బీసీ వర్గాల ఓట్లపై జానా కన్నువేశారనే ప్రచారం జరుగుతోంది.
నాగార్జున సాగర్ లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 23 వేల మంది ఉండగా, వెలమ ఓటర్లు 900 మంది, కమ్మ ఓటర్లు 3 వేల మంది, బ్రాహ్మణ ఓటర్లు 300 మంది, వైశ్య ఓటర్లు 4 వేల మంది, ముస్లిం ఓటర్లు 3వేల మంది, గౌడ ఓటర్లు 12 వేల మంది, మున్నూరు కాపు ఓటర్లు 8 వేల మంది, పెరిక ఓటర్లు 2 వేల మంది, రజక ఓటర్లు 2 వేల మంది, నాయి బ్రాహ్మణ ఓటర్లు 2 వేల మంది, విశ్వకర్మలు 3 వేల మంది, వడ్డెర ఓటర్లు 2 వేల మంది, పద్మాశాలిలు 1000 మంది, కుమ్మరి ఓటర్లు 3 వేల మంది, ముదిరాజులు 9 వేల మంది, ఎరుకల ఓటర్లు 16 వందల మంది, ఇంకా ఇతర వర్గాలు 12 వేల మంది వరకు ఉంటారని గణంకాలు చెబుతున్నాయి.
బీసీ వర్గాల్లోని మున్నూరు కాపులు, గౌడ్స్, ముదిరాజ్ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.అలాగే మిగిలిన సామాజిక వర్గాల వారిని ప్రసన్నం చేసుకునేందుకు.. బీజేపీ అధిష్ఠానం..ఆయా సామాజిక వర్గానికి చెందిన నేతలకు బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. తమ పార్టీకి చెందిన ఆయా సామాజిక వర్గం నేతలు నాగార్జున సాగర్ లో 15 రోజులు పాటు అక్కడే ఉండి ప్రచారం నిర్వహించాలే ప్రణాళికలు రూపొందించింది బీజేపీ.
మరోవైపు టీఆర్ఎస్ నేతలు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అభ్యర్థిని ప్రకటించే కంటే ముందు నుంచే నియోజకవర్గంలోని మండలాల వారిగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని కులాలను సైతం గ్రామాల వారిగా సమీకరించినట్లు తెలుస్తోంది. కులాల వారిగా వారి డిమాండ్లను తెలుసుకుని…, వాటిని పుల్ పీల్ చేసేందుకు రెడీ అయినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. కులం కట్టుబాటును అనుసరించి., కుల పెద్దలు చెప్పిన అభ్యర్థికే ఓటు వేయాలని., ఆయా కులస్థుల నుంచి, కుల సంఘాల నుంచి మాట తీసుకుంటున్నారని కొంతమంది క్షేత్రస్థాయి నాయకులు చెబుతున్నారు.
సో… యూపీ, బీహార్ మాదిరిగానే…ఇటు నాగార్జున సాగర్ పోరులో గంపగుత్త ఓట్ల కోసం సరికొత్త సోషల్ ఇంజనీరింగ్ ను అటు అధికార టీఆర్ఎస్, ఇటు బీజేపీ ప్రారంభించినట్లు స్పష్టమవుతోంది. అయితే నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు.., ఈ సోషల్ ఇంజనీరింగ్ లో ట్రాప్ లో పడతారా? లేక తమకు నచ్చిన అభ్యర్థికే ఓటు వేస్తారా ? అనేది తెలియాలంటే మే 2వ తేదీ వరకు ఆగాల్సిందే.