మా ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణు.. సంచలన నిర్ణయం తీసుకున్న నాగబాబు

0
767

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో విజయం సాధించారు. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పోలయ్యాయి. మా అసోసియేషన్‌లో మొత్తం 883 మందికి ఓటు హక్కు ఉండగా, ఈసారి రికార్డు స్థాయిలో 665 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాన కార్యదర్శి పదవి కోసం ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ పడిన జీవితా రాజశేఖర్ 27 ఓట్ల తేడాతో రఘుబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. మాదాల రవి మంచు విష్ణు ప్యానల్ నుంచి ఉపాధ్యక్షుడిగా గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కోసం ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి పోటీపడిన శ్రీకాంత్.. బాబూమోహన్‌పై 106 ఓట్ల తేడాతో గెలుపొందారు. విష్ణు ప్యానల్ నుంచి కోశాధికారి పదవికి పోటీ చేసిన శివబాలాజీ ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసిన నాగినీడుపై 67 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కార్యవర్గ సభ్యులుగా మంచు విష్ణు ప్యానల్ నుంచి మాణిక్, హరినాథ్, బొప్పన విష్ణు, పసునూరి శ్రీనివాస్, శ్రీలక్ష్మి, జయవాణి, శశాంక్, పూజిత ఎన్నిక కాగా, ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి అనసూయ, సురేశ్ కొండేటి, కౌశిక్, శివారెడ్డి విజయం సాధించారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ.. తనను నమ్మారు కాబట్టే ఓటు వేసి గెలిపించారని అన్నారు. తాను గెలిచినప్పటికీ ప్రకాశ్ రాజ్ ఓడిపోవడం బాధ కలిగిస్తోందని తెలిపారు. ‘మా’ కోసం తాము ఎంతో చేయాలని ప్రణాళికలు రూపొందించుకున్నామని, గత రెండు నెలలుగా తాము కలిసి ప్రయాణించామని అన్నారు. తమ బృందం మా పీఠం ఎక్కలేకపోవడం కొంచెం నిరాశ కలిగించే విషయమని.. ఇది కూడా ఓ సినిమా అనుకుని వెళ్లిపోవడమేనని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణుకు అభినందనలు తెలిపారు.

మంచు విష్ణు ప్యానల్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన నాగబాబు.. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచాడన్న ప్రకటన రాగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సంకుచిత మనస్తత్వం, ప్రాంతీయవాదంతో కొట్టుమిట్టాడుతున్న మా అసోసియేషన్‌లో కొనసాగడం ఇష్టం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. రాజీనామా లేఖను 48 గంటల్లో ‘మా’ కార్యాలయానికి పంపుతానని అన్నారు. ఆషామాషీగా తాను ఈ నిర్ణయాన్ని తీసుకోలేదని, పలు విధాలుగా ఆలోచించిన తర్వాత పూర్తి చిత్తశుద్ధితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాగబాబు తెలిపారు.

మా ఎన్నికల పోలింగ్ సమయంలో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ లు కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, నటి హేమ తీవ్ర ఆగ్రహంతో శివబాలాజీ చేతిపై కొరికింది. తనను అడ్డుకోవడానికి శివబాలాజీ ప్రయత్నించాడని, అందుకే తాను కొరకాల్సి వచ్చిందని ఆ తర్వాత హేమ వివరణ ఇచ్చారు. హేమ కొరకడంతో శివబాలాజీ చేతిపై గాయం అయింది. పంటిగాట్ల కారణంగా సెప్టిక్ అవుతుందేమోనన్న భయంతో శివబాలాజీ టీటీ ఇంజెక్షన్ వేయించుకున్నారు. ఓటింగ్ అనంతరం నిమ్స్ కు వెళ్లిన ఆయన చేతిపై గాయానికి చికిత్స పొందారు.