More

  అగ్నిపథ్‎పై అపోహలు.. అర్ధంలేని ఆందోళనలెందుకు..?

  దేశ వ్యాప్తంగా అగ్నిపథ్ స్కీంపై తీవ్ర స్థాయిలో అందోళనలు జరుగుతున్నాయి. అయితే దేశానికి సేవలు అందించాలనే ఆసక్తిగల యువతను త్రివిధ దళాలలో నియమించేందుకు కేంద్రం తాజాగా అగ్నిపథ్ పథకం ప్రకటించింది. అయితే ఈ పథకానికి సానుకూల స్పందన రావడం మాట అటుంచితే.. యువత నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

  కేవలం నాలుగేళ్లు సైనిక సర్వీస్‌లో ఉంచి ఆ తర్వాత ఇంటికి పంపిస్తే తమ భవిష్యత్తు ఏంటి? అని ప్రస్తుతం ఆర్మీ పరీక్షలకు సిద్ధమవుతున్న చాలా మంది అభ్యర్థులు నిరసనలు చేస్తున్నారు. ఈ ఆర్మీ పథకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అగ్నిపథ్ ప్రోగ్రామ్‌పై నెలకొన్న అపోహలు, వాస్తవాలు ఏంటో తెలియజేసింది.

  అగ్నివీరుల భవిష్యత్తు పదిలంగా ఉండదని.. వీరి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందనే అపోహలు ఉన్నాయి. అయితే వాటిలో వాస్తవం లేదని కేంద్రం చెబుతోంది. సాయుధ బలగాల్లో 4 ఏళ్లు సర్వీస్ చేసిన వారు పారిశ్రామికవేత్తలు కావాలనుకుంటే కేంద్రం వారికి ఆర్థిక ప్యాకేజీ, బ్యాంకు రుణ పథకం అందజేస్తుంది. పైచదువులు చదవాలనుకునే వారికి 12 తరగతికి సమానమైన సర్టిఫికేట్ ప్రదానం చేస్తుంది. అంతేకాదు, తదుపరి చదువుల కోసం బ్రిడ్జింగ్ కోర్సును ఆఫర్ చేస్తుంది. ఉద్యోగాలు పొందాలనుకునే వారికి కూడా ఈ నాలుగేళ్ల సర్వీస్ చాలా హెల్ప్ అవుతుంది. ఈ సర్వీస్‌లో పాల్గొన్న యువతకు సీఏపీఎఫ్, రాష్ట్ర పోలీసుల నియామకాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇతర రంగాలలో కూడా వారికి అనేక అవకాశాలను కేంద్రం కల్పిస్తుంది. ఇలా వారి భవిష్యత్తు చాలా సురక్షితంగా ఉంటుంది.

  నిజానికి నాలుగేళ్లపాటు దేశానికి సేవలందించే యువతీ యువకులకు సాయుధ దళాలలో పనిచేసే అవకాశాలు మెరుగుపడతాయి. కొన్నేళ్లలో సాయుధ దళాలలో ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్‌మెంట్ల కంటే అగ్నివీరుల రిక్రూట్‌మెంట్లు మూడు రెట్లు పెరుగుతాయి. ఇక అగ్నిపథ్ పథకం వల్ల రెజిమెంటల్ వ్యవస్థలో ఎలాంటి మార్పు ఉండదు. నిజానికి ఈ పథకం వల్ల అగ్నివీరులలో అత్యుత్తమమైన యువత సెలెక్ట్ అవుతారు. తద్వారా సాయుధ బలగాల బృందం సమన్వయాన్ని మరింత పెంచినట్లు అవుతుంది.

  అయితే ఈ తరహా స్వల్పకాలిక నియామక విధానం చాలా దేశాలలో ఉంది. ఈ విధానాన్ని ఇప్పటికే చాలాచోట్ల విజయవంతంగా పరీక్షించడం జరిగింది. యువత, శక్తివంతమైన సైన్యాన్ని పెంచాలంటే ఈ విధానమే ఉత్తమంగా నిలుస్తుంది. మొదటి సంవత్సరంలో రిక్రూట్ అయ్యే అగ్నివీరుల సంఖ్య సాయుధ దళాలలో 3% మాత్రమే ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత సైన్యంలోకి శాశ్వతంగా యువతను తీసుకునే ముందు అగ్నివీరుల పనితీరును పరీక్షిస్తారు. అందువల్ల ఆర్మీ పర్యవేక్షక ర్యాంక్‌ల కోసం అనుభవం, అర్హత ఉన్న సిబ్బందిని పొందడం సాధ్యమవుతుంది. ఇక ప్రపంచంలోని చాలా దేశాల సైన్యాలు తమ యువతపైనే ఆధారపడుతున్నాయి. అయితే ఏ సమయంలో చూసుకున్న ఎక్స్‌పీరియన్స్‌ అఫీషియల్స్ కంటే ఎక్కువ మంది యువకులు ఉండరు. ప్రస్తుత పథకం చాలా నెమ్మదిగా సుదీర్ఘ కాలంలో యువకులు, ఎక్స్‌పీరియన్స్‌డ్‌ పర్యవేక్షక ర్యాంక్‌ల అధికారులు 50%-50% ఉండేలా చేస్తుంది.

  అయితే 4 ఏళ్ల సర్వీస్ తర్వాత అగ్నివీరులు సమాజానికి ప్రమాదకారులుగా మారతారని… ముఖ్యంగా వారు ఉగ్రవాదులతో చేతులు కలుపుతారని ప్రచారం జరుగుతోంది. ఇలా చెప్పడం భారత సాయుధ బలగాల ధర్మాన్ని, విలువలను అవమానించినట్లే అవుతుంది. నాలుగేళ్లుగా యూనిఫాం ధరించి భారత మాతకు సేవలందించిన యువకులు జీవితాంతం దేశం కోసమే పని చేస్తారు కానీ దేశానికి ద్రోహం చేయరు. అంతెందుకు, ఏటా వేలాది మంది సాయుధ బలగాల నుంచి పదవీ విరమణ పొందుతున్నారు. కానీ వారిలో ఏ ఒక్కరూ దేశ వ్యతిరేక దళాలలో చేరిన దాఖలాలు లేవు. అందువల్ల అగ్నివీరులు ఉగ్రవాదులతో చేరతారని అనడం పూర్తిగా అసంబద్ధమే! కేంద్రం ఈ పథకం గురించి ప్రస్తుతం సేవలందిస్తున్న సాయుధ దళాల అధికారులతో గత రెండేళ్లుగా సంప్రదింపులు జరిపింది. మిలిటరీ అధికారులతో కూడిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ ఆఫీసర్స్ ఈ ప్రతిపాదనను రూపొందించారు. నిజానికి దాదాపు అందరూ మాజీ అధికారులందరూ అగ్నిపథ్ పథకం ప్రయోజనాలను గుర్తించి దానిని సంతోషంగా స్వాగతించారు.

  spot_img

  Trending Stories

  Related Stories