అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో భారత్ తలపడేందుకు సిద్ధంగా ఉంది. నాలుగు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో చివరి టెస్ట్. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవాలని భారత్ చూస్తోంది. అహ్మదాబాద్‌లో విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ ఇద్దరూ మొదటి రోజు మ్యాచ్ కు హాజరుకానున్నారు.
ప్రపంచ నాయకులు ఇద్దరూ టాస్‌కు హాజరవుతారని, మ్యాచ్ ను ప్రారంభించడానికి టాస్ కు హాజరు కావచ్చని ఆస్ట్రేలియా పీఎం అల్బనీస్ ధృవీకరించారు. NOVA 93.7 పెర్త్ రేడియో స్టేషన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియా ప్రధాని మాట్లాడుతూ, “నేను, ప్రధాని మోదీ టాస్ కు హాజరయ్యే అవకాశం ఉంది” అని చెప్పుకొచ్చారు. మ్యాచ్‌ను వీక్షించేందుకు నేడు లక్షమంది ప్రేక్షకులు వస్తారని అంచనా. ఇప్పటికే 75 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ప్రధాని రాక నేపథ్యంలో స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టులను భారత్ సొంతం చేసుకోగా, మూడో మ్యాచ్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. దీంతో నేటి మ్యాచ్ కీలకంగా మారింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు భారత్ చేరుకోవాలన్నా ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం.