More

    రష్యా ఓనర్ మీద కోపం.. 58 కోట్ల విలువైన పడవను ముంచేయాలని చూశాడు

    ప్రేమ, ద్వేషం.. లాంటివన్నీ తీవ్రమైన భావోద్వేగాలు.. వీటన్నిటికంటే గొప్పది దేశభక్తి. ఏది ఏమైనా.. మాతృభూమి విషయానికి వస్తే మాత్రం దేన్నైనా లెక్కచేయని వారు చాలా అరుదుగా ఉంటారు. ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా దండెత్తిన సంగతి తెలిసిందే..! ఎంతో మంది దేశం కోసం పోరాడడానికి ముందుకు వస్తున్నారు. ఎన్నో మార్గాలలో రష్యాను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. ఓ ఉక్రేనియన్ నావికుడు తన రష్యా యజమానికి ఊహించని షాకిచ్చాడు.

    ఉక్రేనియన్ నావికుడు తన రష్యన్ బాస్ లగ్జరీ పడవను ముంచేయాలని ప్రయత్నించాడు. ఆ పడవను ముంచడానికి ప్రయత్నించినందుకు పోలీసులు ఆ నావికుడిని అరెస్టు చేసినట్లు నివేదించబడింది. రష్యా ఉక్రెయిన్‌పై దండయాత్రను ప్రకటించినప్పటి నుండి ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతూ ఉంది. ఉక్రెయిన్ పౌరులు ఏకమై రష్యా సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు చేతబట్టగా, స్పెయిన్‌లో ఉన్న ఉక్రేనియన్ నావికుడు తన దేశానికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని భావించాడు. రోసోబోరోనెక్స్‌పోర్ట్ CEO అయిన అలెగ్జాండర్ మిజీవ్‌కు చెందిన 156 అడుగుల పడవను నీటిలోకి ముంచేయాలని చూశాడు. ఎందుకంటే అతను తన యజమాని ‘ఉక్రేనియన్ ప్రజలను చంపే ఆయుధాలను అమ్ముతున్న నేరగాడు’ అని ఆరోపించాడు.

    ఆ పడవ పేరు ‘లేడీ అనస్తాసియా’ అలెగ్జాండర్‌కు చెందినది. ఆ కంపెనీ రష్యా రక్షణ ఉత్పత్తులైన ఆయుధాలు, ఓడలు, ట్యాంకులు, పోరాట వాహనాలను ఎగుమతి చేస్తుంది. ఉక్రేనియన్ నావికుడు ఓస్టాప్‌చుక్ మాట్లాడుతూ “నేను యుద్ధం గురించిన వార్తలను చూశాను. కైవ్‌లోని ఓ భవనంపై హెలికాప్టర్ దాడికి సంబంధించిన వీడియో అది. ఆ దాడికి ఉపయోగించిన ఆయుధాలను పడవ యజమానికి చెందిన కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. వారు అమాయకులపై దాడి చేశారు.” అని చెప్పుకొచ్చాడు. యాచ్ ఇంజిన్ గదిలోని కవాటాలను తెరవడంతో అది పాక్షికంగా మునిగిపోయింది.

    “నేను చేసిన పనికి నేను చింతించను. నేను మళ్ళీ అదే పనే చేస్తాను” అని ఓస్టాప్‌చుక్ అన్నాడు. అతనిని శనివారం స్పెయిన్ సివిల్ గార్డ్ అరెస్టు చేసి ఆదివారం కోర్టులో హాజరుపరిచింది. అక్కడ అతను తన చర్యలకు చింతించలేదని తెలిపాడు. $7.7 మిలియన్ల పడవను ముంచేసే ప్రయత్నం తర్వాత అతడు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. రష్యాపై పోరాటంలో చేరడానికి ఉక్రెయిన్‌కు వెళ్లాలని భావిస్తున్నాడు.

    Trending Stories

    Related Stories