ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడంపై సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి

0
750

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌ బంజారా హిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని ఇంట్లోని బాత్‌రూంలో ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె గదిలో కార్బన్‌ మోనాక్సైడ్‌ బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్వాస ఆగిపోయి కార్డియాక్ అరెస్ట్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. విషవాయువు పీల్చడం వల్ల శ్వాస ఆగిపోయి చనిపోయినట్లుగా డాక్టర్ల ప్రిలిమినరీ ఒపీనియన్ వెల్లడించారు.

దేశంలో టాప్‌ 30 ఫ్యాషన్ డిజైనర్లలో ప్రత్యూష ఒకరు. టాలీవుడ్‌, బాలీవుడ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలకు ప్రత్యూష దుస్తులు డిజైన్‌ చేశారు. దీపికా పదుకొనే, కీర్తి సురేష్‌, శృతి హసన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, శ్రియ, నిక్కీ గల్రానీ, కృతి కర్భంద, ప్రణీతతో పాటు పలువురు తారలకు డ్రెస్‌లు డిజైన్‌ చేశారు.

ప్ర‌త్యూష గ‌రిమెళ్ల సూసైడ్ నోట్ లో త‌న ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌ను వివ‌రంగా వెల్ల‌డించింది. తాను స్వేచ్ఛ‌ను కోరుకున్నాన‌ని.. తాను ఎవ‌రికీ భారం కాద‌ల్చుకోలేద‌ని కూడా ఆమె తెలిపారు. డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అనేక సార్లు య‌త్నించిన‌ట్లు చెప్పిన ప్ర‌త్యూష‌ ప్ర‌తి రోజు తాను బాధ‌ప‌డుతూనే ఉన్న‌ట్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శ‌నివారం రాత్రి ఉస్మానియా ఆసుప‌త్రిలో ప్ర‌త్యూష మృత‌దేహానికి పోస్టు మార్టం పూర్తి అయ్యింది.

ప్రత్యూష గ‌రిమెళ్ల ఆత్మహత్యపై రామ్ చరణ్ సతీమణి ఉపాసన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రత్యూషతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రత్యూషతో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేశారు. ప్రత్యూష తనకు చాలా మంచి స్నేహితురాలు అని.. చాలా త్వరగా ఈ లోకాన్ని వెళ్లిపోయిందంటూ ఉపాసన రాసుకొచ్చారు. ప్రత్యూష అన్ని విషయాల్లో చాలా గొప్పగా ఆలోచించేదని.. ఇలా అనుకోకుండా ఒత్తిడికి గురవ్వడం బాధాకరమని అన్నారు. ప్రత్యూష ఆత్మకు శాంతి కలగాలని ఆమె కోరుకున్నారు. పలువురు ప్రముఖులు ప్రత్యూష ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.