దేశ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు.. వాళ్ల పనే..!

0
811

బీజేపీ బహిష్కృత నేత నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ప్రదర్శనలతో ఢిల్లీ జామా మసీద్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అలాగే హైద‌రాబాద్‌లోని చార్మినార్‌, ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌తో పాటు దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌కు దిగారు.

శుక్రవారం నమాజ్‌ ముగిసిన వెంటనే వందల మంది జామా మసీద్‌ బయట బీజేపీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు చెప్తున్నారు. ముహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు, సోషల్‌ మీడియా పోస్ట్‌ చేసినందుకు నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌పై బీజేపీ వేటు వేసింది. ఈ ఘటనపై దుమారం రేగడంతో.. నూపుర్‌ క్షమాపణలు కూడా చెప్పింది. అదే సమయంలో వేర్వేరు చోట్ల ఈ ఇద్దరిపై కేసులు కూడా నమోదు అయ్యాయి. అయినా వివాదం సద్దుమణగడంలేదు.

తాజాగా.. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన వెంటనే ఢిల్లీ జామా మసీద్‌ బయట కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చిన్నపిల్లలతో సహా వందల మంది నూపుర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జామా మ‌సీదు వ‌ద్ద దాదాపు 1500 మంది ఆందోళ‌న‌కు దిగారు. ఈ సమాచారం అందగానే.. అక్క‌డ‌కు 300 మంది పోలీసులు చేరుకున్నారు. మరోవైపు.. ఈ నిరసనలకు తమకు ఎలాంటి సంబంధం లేదని జామా మసీద్‌ నిర్వాహకులు తెలిపారు. బహుశా వాళ్లంతా ఎంఐఎంకు చెందిన వాళ్లు అయ్యి ఉండొచ్చని, అలాంటి నిరసనలకు తమ మద్ధతు ఎప్పుడూ ఉండబోదని మసీద్‌ నిర్వాహక కమిటీ స్పష్టం చేసింది. జామా మసీద్‌తో పాటు యూపీ, సహారన్‌పూర్‌, మోరాదాబాద్‌ మసీదుల బయట కూడా శుక్రవారం ప్రార్థనల తర్వాత నూపుర్‌ కామెంట్లపై నిరసనలు వెల్లువెత్తాయి.

హైదరాబాద్‌లోనూ ఇదే తరహా వాతావరణం కనిపించింది. శుక‍్రవారం ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లింలు ఆందోళనకు దిగారు. మహ్మద్‌ ప్రవక్తపై మాజీ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు నినాదాలు చేస్తూ మక్కా మసీద్‌ నుంచి చార్మినార్‌ వరకు ర్యాలీ తీశాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చార్మినార్‌ వద్ద పోలీసు బలగాలు భారీ సంఖ్యలో మోహరించాయి. అలాగే ఆందోళ‌న‌కారుల‌ను అదుపు చేసేందుకు పోలీసులు య‌త్నిస్తున్నారు. అటు ప్ర‌యాగ్ రాజ్‌లో ఆందోళ‌న‌కారులు రాళ్లు రువ్వ‌వ్వారు. అల్లరిమూకలపై వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల అనంత‌రం ముస్లింలు ఊహించ‌ని విధంగా ఆందోళ‌న‌ల‌కు దిగ‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. జ‌మ్మూక‌శ్మీర్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవ‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ షహరాన్ పూర్ లో కూడా ఉద్రిక్తత తలెత్తింది. నుపుర్ శర్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ముస్లింలు నిరసన తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో, కాన్పూర్, ఫిరోజాబాద్ పట్టణాల్లో పోలీసులు టైట్ సెక్యురిటీని పెట్టారు. మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై కాన్పూర్ లో ఇటీవల ఘర్షణలు తెలెత్తాయి. కాన్పూర్ లో జరిగిన రాళ్లదాడిలో 40 మంది వరకు గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ లోనూ ముస్లింలు ఆందోళన బాట పట్టారు. నిరసనకారులు రాళ్లదాడికి దిగడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇదిలా ఉంటే ఖతార్, యూఏఈ, లెబనాన్, సౌదీ, ఇరాక్, మలేషియా వంటి పలు ముస్లిం దేశాలు మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేఖంగా చేసిన వ్యాఖ్యలపై భారత్ కు తమ నిరసన వ్యక్తం చేశాయి. అయితే.. వ్యక్తిగతంగా కొంతమంది చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఏలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది భారత్.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here