ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎహసాన్ రావ్ అనే ముస్లిం యువకుడు ‘జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై’ అని నినాదాలు చేయకుండా తనను ఎవరూ ఆపలేరని ఛాందసవాదులకు, మౌలానాలకు గట్టి సమాధానం చెప్పాడు. డిసెంబరు 2న షహరాన్‌పూర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ల ర్యాలీలో జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేస్తూ ఎహసాన్ రావ్ కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి భుజంపైకి ఎక్కి మరీ ఎహసాన్ రావ్ నినాదాలు చేస్తూ కనిపించాడు.
జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై అని పలికినందుకు పశ్చాత్తాపపడాలని, లేకుంటే ఇస్లాం నుండి బహిష్కరించబడతారని దేవ్‌బంద్‌లోని కొంతమంది మౌలానాలు అతడిని హెచ్చరించారు. దేవ్‌బంద్ మదర్సా షేకుల్ హింద్‌కు చెందిన ముఫ్తీ అసద్ కాశీం మాట్లాడుతూ.. ఎహసాన్ రావ్ ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వీటిని ఇస్లాంలో నిషేధించారని.. ఇలాంటి చర్యలకు పశ్చాత్తాపపడాలి అని కాశీం అన్నారు.
అయితే తనను తాను రాముడి వారసునిగా భావిస్తున్నానని ఎహసాన్ రావ్ చెప్పారు. మేము రాముడి వారసులం. ఆయన మా పూర్వీకుడు. మనం నివసించే దేశాన్ని కీర్తిస్తూ జపం చేయడంలో సమస్య లేదు. జై శ్రీరామ్ అన్నది ప్రేమతో కూడిన నినాదం. రాముడు కోట్లాది ప్రజల విశ్వాసానికి మూలకారకుడు అని ఎహసాన్ రావ్ అన్నారు.
తన నినాదాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన మౌలానాలపై ఎహసాన్ రావ్ ప్రశ్నల వర్షం కురిపించారు. “జై నెహ్రూ, జై లోహియా, జై భీమ్, జై చరణ్ సింగ్ నినాదాలకు వ్యతిరేకంగా వారు ఫత్వా జారీ చేస్తారా? అలాంటప్పుడు జై శ్రీరామ్ పై ఎందుకు ఫత్వా జారీ చేశారు? నినాదాలు చేసినందుకు నన్ను బెదిరిస్తున్నారు. కానీ నన్ను ప్రభుత్వం కాపాడుతుందనే నమ్మకం నాకు ఉంది. మీరు (మౌలానాలు) మీ మతంతో సంతోషంగా ఉంటారు.. నేను నా విశ్వాసంతో సంతోషంగా ఉంటాను”అని ఎహసాన్ రావ్ అన్నారు.
ఎహసాన్ రావ్ తనపై బెదిరింపులకు దిగిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మాతృభూమిని ప్రార్థించడం పట్ల ఇస్లామిక్ ఛాందసవాదుల ద్వేషం కొత్తది కాదు. మార్చి 2016లో భారత్ మాతా కీ జై కి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసిన సంగతి తెలిసిందే..!