ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత 11 రోజులుగా కొనసాగుతున్న కాల్పులకు తెరపడింది. హింసలో 200 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లోనూ మరణాలు సంభవించాయి. హమాస్ ఇజ్రాయెల్‌పై వందలాది రాకెట్లను ప్రయోగించగా, ఇజ్రాయెల్ గాజాను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. ఇజ్రాయెల్ దాడితో భయకంపితులైన పాలస్తీనియన్లు వేలాదిమంది గాజాను వీడి వెళ్లిపోయారు. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ మంత్రి వర్గం ఆమోదించింది. కాల్పుల విరమణను హమాస్ వర్గాలు కూడా నిర్ధారించాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ మౌలానా ముస్లింలందరూ పాలస్తీనా జెండాలను ఇళ్లపై ఎగురవేయాలని పిలుపును ఇచ్చారు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లడంతో ఇప్పుడు సదరు మౌలానా ఊచలు లెక్కిస్తూ ఉన్నారు. గురువారం నాడు ఉత్తరప్రదేశ్ పోలీసులు మౌలానా యాసిర్ అక్తర్ ను అరెస్టు చేశారు. శుక్రవారం నాడు నమాజ్ అవ్వగానే అందరూ ఇళ్లపై పాలస్తీనా జెండాలను ఉంచాలని.. వాహనాలకు కూడా పాలస్తీనా జెండాలను తగిలించాలని సూచించారు. ఈ విషయం పోలీసులకు కొందరు పిర్యాదు చేయడంతో యాసిర్ అక్తర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 505 (2) (statements conducing to public mischief) కింద యాసిర్ అక్తర్ పై కేసు నమోదు చేశారు.
ఆజంఘర్ ఎస్.పి. సుధీర్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. సరామిర్ ప్రాంతంలోని నార్త్ చురిహార్ కస్బాకు చెందిన యాసిర్ తన ఫేస్ బుక్ పేజీ ‘ఆజంఘర్ ఎక్స్ ప్రెస్’ లో శుక్రవారం ముస్లింలు నమాజ్ చేసిన వెంటనే ఇళ్లపై పాలస్తీనా జెండాలను ఎగురవేయాలని కోరారు. వాహనాలకు కూడా పాలస్తీనా జెండాలను పెట్టుకోవాలని కోరాడని తెలిపారు. ఈ పోస్టుల ఆధారంగా అతడిపై సరామిర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవలే ఉత్తరప్రదేశ్ లోని కన్నూజ్ పోలీసు స్టేషన్ పరిధిలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 15 మంది ఈద్ సెలెబ్రేషన్స్ లో భాగంగా పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు.