National

దమ్ముంటే నా ముందుకు రండి.. ఉగ్రవాదులకు కశ్మీర్ పండిట్ కుమార్తె సవాల్..!!

జమ్మూ కశ్మీర్ లో మరో కశ్మీర్ పండిట్ ను చంపేశారు. ఇక్బాల్‌ పార్క్‌లోని బింద్రూ మెడికేట్‌ ఫార్మశీ యజమాని కాశ్మీరీ పండిట్ అయిన లాల్‌ బింద్రూ (70) అతని ఫార్మశీ దుకాణంలో పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 1990 నాటి వలసల సందర్భంగా జమ్మూకశ్మీర్‌లోనే ఉండిపోయిన అతికొద్దిమంది కశ్మీరీ పండిట్లలో బింద్రూ ఒకరు. అప్పటి నుండి ఆయన మెడికల్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. పోలీసులు, భద్రతా సిబ్బంది వారిని పట్టుకునేందుకు యత్నించగా అయితే అప్పటికే ఉగ్రవాదులు పారిపోయారు. ఫార్మసీలో మందులను పంపిణీ చేస్తుండగా తీవ్రవాదులు ఒక్కసారిగా దుకాణంపై కాల్పులకు తెగబడ్డారు. బింద్రూను పాయింట్‌-బ్లాంక్‌ రేంజ్‌లో కాల్చారు.

మక్కన్ లాల్ బింద్రూ చిన్న కుమార్తె డాక్టర్ శ్రద్ధా బింద్రూ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రిని చంపిన గుర్తు తెలియని ఉగ్రవాదులకు సవాల్ విసిరింది. రాళ్లు రువ్వడం.. ఇలా హింసకు తెగబడడం ఉగ్రవాదులకు చేతనయ్యే పని ఇదేనని ఆమె తెలిపింది. “నేను అసోసియేట్ ప్రొఫెసర్, నా సోదరుడు ప్రముఖ డయాబెటాలజిస్ట్, మా అమ్మ మా దుకాణం నడుపుతోంది. మా నాన్న ఏమి లేని స్థాయి నుండి మొదలుపెట్టాడు.. మమ్మల్ని ఓ మంచి స్థాయిలో ఉంచారు. ఈ వ్యక్తులు (తీవ్రవాదులు) శరీరాన్ని మాత్రమే చంపగలరు, కానీ ఆత్మను చంపలేరు. తెలివైన చర్చలు చేయలేరు. రాళ్లు విసరడం, వెనుకనుండి వచ్చి కాల్చడం తప్ప ఏమీ చేయలేరని” ఆమె తెలిపారు. “మీకు ధైర్యం ఉందని మీరు అనుకుంటే, వచ్చి మా ముందు కూర్చుని చర్చించండి. నేను కూడా కశ్మీర్ పండిట్ బిడ్డను వచ్చి నన్ను ఎదుర్కోండి” అంటూ కెమెరా ముందు సవాల్ విసిరింది.

అక్టోబర్ 5న జమ్మూ కశ్మీర్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదులు ముగ్గురు అమాయక పౌరులను చంపారు. బింద్రూ కాకుండా, వీరేంద్ర పాశ్వాన్ అనే వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. అతను భాగల్‌పూర్‌కు చెందినవాడు.. ఆలంగారి బజార్ జాడిబాల్ ప్రాంతంలో ఉండేవాడు. మహ్మద్ షఫీ లోన్ అనే వ్యక్తిని కూడా చంపేశారు. ఉత్తర కశ్మీర్‌లోని బందిపూర్‌లోని షాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యాడు.

Related Articles

Back to top button