నాగరాజు ఎక్కడున్నాడో తెలుసుకోడానికి ప్రత్యేక స్పైవేర్ ను ఉపయోగించిన ముబిన్ అహ్మద్

0
845

ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న నాగరాజు.. ఆ అమ్మాయి సోదరుడు ముబీన్ అహ్మద్ అతి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే..! నాగరాజుని హత్య చేసేందుకు నిందితుడు సయ్యద్ ముబిన్ అహ్మద్ పథకం వేసినట్లు హైదరాబాద్ పోలీసుల రిమాండ్ రిపోర్టులో గురువారం వెల్లడైంది. సయ్యద్ ముబిన్ అహ్మద్ తన సోదరి అష్రిన్ సుల్తానాను మతాంతర వివాహం చేసుకున్నందుకు కోపంతో నాగరాజును ప్రజలందరూ చూస్తుండగా దారుణంగా హత్య చేశాడు. నివేదికల ప్రకారం, నిందితులు నాగరాజును హత్య చేసిన రోజున ట్రాక్ చేయడానికి, ఎక్కడ ఉన్నాడో గుర్తించడానికి మొబైల్ స్పైవేర్‌ను ఉపయోగించారు. నిందితుడు మొదట నాగరాజును అతను పనిచేసే కార్ షోరూమ్ బయటే హత్య చేయాలని ప్లాన్ చేశాడు, కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్లాన్ అమలు చేయలేకపోయాడు. ఆ తర్వాత నాగరాజు, అతని భార్య బంధువుల ఇంటి నుంచి ఇంటికి వెళ్తుండగా సహచరుడితో కలిసి దాడి చేశాడు.

నాగరాజును ప్రేమిస్తున్నందుకు ముబిన్ అహ్మద్ తన సోదరిని పలు సందర్భాల్లో కొట్టాడని, హిందూ వ్యక్తి కావడంతో అతడికి దూరంగా ఉండాలని హెచ్చరించాడని పోలీసుల నివేదికలో పేర్కొన్నారు. అతడి మాటలను సుల్తానా పట్టించుకోలేదు.. జనవరి 30న తన ఇంటి నుంచి వెళ్లిపోయి నాగరాజును ఆర్యసమాజ్‌లో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంది.

అయితే ముబిన్ అహ్మద్ తన సోదరి హిందూ అబ్బాయితో వివాహం చేసుకోవడంతో కోపంతో రగిలిపోయాడు. తన సోదరి తన పేరును సుల్తానా నుండి పల్లవిగా మార్చుకోవడాన్ని కూడా అతడు ఇష్టపడలేదు సరి కదా.. తన సోదరిని విడిచిపెట్టాలని నాగరాజును బెదిరించాడు. అయితే సుల్తానా, నాగరాజు అందుకు నిరాకరించారు. అహ్మద్ నాగరాజుపై నిఘా ఉంచడం మొదలుపెట్టి, చంపడానికి కుట్ర పన్నాడు. నాగరాజు, సుల్తానాపై నిఘా ఉంచేందుకు ఇద్దరూ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించారు. ముబిన్ అహ్మద్ గతంలో నాగరాజును కలిశాడని, అతనికి సహకరించినట్లు నటించాడని సమాచారం. నాగరాజు జీవితంలో ఇతర మహిళలు ఉన్నారా అని.. అతని ఫోన్‌ని తనిఖీ చేసే నెపంతో అతను స్పైవేర్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. మే 4న సరూర్‌నగర్ ప్రాంతంలో నాగరాజును గుర్తించి, ప్లాన్ అమలు చేసేందుకు అతని మరో బావ మన్సూర్ అహ్మద్‌కు ఫోన్ చేశాడు.

వీరిద్దరూ కత్తి, ఇనుప రాడ్లు ఏర్పాటు చేసుకుని సరూర్‌నగర్ ప్రాంతానికి చేరుకున్నారు. ఇంతలో వారు నాగరాజు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి నగరంలోని మారుతీ షోరూమ్‌కు చేరుకున్నారు. అతడి ఉద్యోగం అయిపోయాక.. వీధిలో కూడా అతనిని అనుసరించారు. భారీ ట్రాఫిక్‌లో లక్ష్యాన్ని గుర్తించడంలో ఇద్దరూ విఫలమయ్యారు. నాగరాజు బంధువుల నివాసం నుండి తన భార్యతో ఇంటికి వెళుతుండగా వారు అతని లొకేషన్ ను గుర్తించి, హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం వెలుపల హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోగా, హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.