మునుగోడు ‘విజేత’.. కూసుకుంట్ల ప్రభాకర్‎రెడ్డి

0
774

మునుగోడులో కారు దూసుకుపోయింది. నియోజకవర్గంలోని గ్రామీణ, పట్టణ ఓటర్లు కూడా గులాబీకే పట్టం కట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‎రెడ్డి, సమీప బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‎రెడ్డిపై 11వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఐతే సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది.

వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్‎గా భావిస్తున్న మునుగోడు బై పోల్‎లో అధికార పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఒక్క చౌటుప్పల్లో టఫ్ ఫైట్ తప్ప ఏడు మండలాల్లోనూ గులాబీ గుభాళించింది. మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ మొత్తం ఎంతో ఉత్కంఠగా సాగింది. మొత్తం 21 టేబుళ్లను ఏర్పాటు చేసి.. 15రౌండ్లలో ఓట్లు లెక్కించారు. తొలుత లెక్కించిన 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్‎కు 228 ఓట్లు రాగా బీజేపీకి 224ఓట్లు వచ్చాయి. బీఎస్పీకి 10ఓట్లు, ఇతరులకు 88ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి 4 ఓట్ల ఆధిక్యం సాధించారు. అనంతరం చౌటుప్పల్ మండలం ఓట్లను లెక్కించారు. తొలి రౌండ్లో కారు దూసుకుపోయింది. అయితే ఆ తర్వాత రెండు, మూడో రౌండ్లలో బీజేపీ ఆధిక్యం సాధించింది. ఇక నాలుగో రౌండ్ నుంచి 14వ రౌండ్ వరకు కూడా అన్నింటిలో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. చివరికి 15వ రౌండ్‎లో బీజేపీకి స్వల్ప లీడ్ వచ్చింది. దీంతో 11వేలకుపైగా ఓట్ల మెజార్టీతో రాజగోపాల్‎రెడ్డిపై కూసుకుంట్ల ప్రభాకర్‎రెడ్డి విజయం సాధించారు. కారును పోలిన ఉన్న గుర్తులతో కూడా కొంత టీఆర్ఎస్‎కు నష్టం జరిగింది.

మునుగోడులో ఉప ఎన్నిక ఫ‌లితాల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నిరాశ ఎదురైంది. సిట్టింగ్ స్థాన‌మైన మునుగోడును నిల‌బెట్టులేక‌పోయింది. కనీసం డిపాజిట్ కూడా రాలేదు. కేవ‌లం 21వేల పైచిలుకు ఓట్లే స్ర‌వంతికి పోల‌య్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన ఏ ఉప ఎన్నిక‌లో కూడా కాంగ్రెస్ గెలువ‌లేక‌పోయింది. దుబ్బాక‌, హుజుర్‌న‌గ‌ర్‌, హుజురాబాద్ ఉప ఎన్నిక‌తో పాటు తాజాగా జ‌రిగిన మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓట‌మిని చ‌వి చూసింది. అధికార పార్టీకి క‌నీసం పోటీని కూడా ఇవ్వ‌లేకపోయింది. గతంతో పోల్చితే.. ఇప్పుడు కాంగ్రెస్ ప‌రిస్థితి బాగా దిగ‌జారిపోయింది.

మునుగోడులో ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, కనీసం ప్రచారం కూడా చేసుకోనివ్వలేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ అధికారులపై ఒత్తిడి తెచ్చారని, ఇది టీఆర్ఎస్ అధర్మ గెలుపు అని ఆరోపించారు. మునుగోడులో నైతిక విజయం తనదేనన్నారు.

కూసుకుంట్ల గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

thirteen − seven =