More

  మునుగోడులో ఓటెత్తారు

  ఒక అంకం ముగిసింది. తెలంగాణవ్యాప్తంగా అమితాసక్తి రేకెత్తించిన మునుగోడు బై పోల్ కీలక ఘట్టం పూర్తైంది. ఈవీఎం బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది.

  తెలంగాణలో ఎంతో ఉత్కంఠ రేపిన మునుగోడులో ఓటెత్తారు. ఎంతో ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్.. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. బై పోల్‎లో పోలింగ్ తొలుత కాస్తంత మందకోడిగా సాగినా… ఆ తర్వాత ఊపందుకుంది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నవారికి ఓటేసేందుకు అనుమతిచ్చారు. 2018లో 91.3శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 41వేల 805 ఓట్లు ఉన్నారు.

  నారాయణపురం మండలం లింగవారిగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‎రెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకోగా.. చండూరు మండలం ఇడికూడలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు వేశారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ పలుచోట్ల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కేఏ పాల్.. పోలింగ్ టైమ్‎లో హడావుడి చేశారు. పోలింగ్ కేంద్రాలకు పరుగులు పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. తన రెండు చేతుల అన్ని వేళ్లకూ ఉంగరాలు ధరించి పోలింగ్ కేంద్రాల్లో తిరిగారు. ఉంగరం గుర్తు కేటాయిస్తే చేతికి ఉంగరాలతో రావడం ఎన్నికల నిబంధన ఉల్లంఘన కాదా అని ప్రశ్నించగా.. పాల్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇక తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. సీఈవో వికాస్ రాజ్‎కు ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ ఫోటోతో సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీంతో సీఈవో సంబంధిత మాధ్యమాలకు పంపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

  మునుగోడు మండలం కొంపల్లిలోని 145వ పోలింగ్‌ కేంద్రంలో సాంకేతిక సమస్య తలెత్తగా.. కొండాపూర్‎లో ఈవీఎం మొరాయించింది. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల పరిశీలకుడు పంకజ్ కుమార్.. పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.

  చండూరులో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ ఇంట్లో స్థానికేతరులు ఉన్నారంటూ.. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరగ్గా.. స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. పుట్టపాకలో స్థానికేతరులను అబ్జర్వర్‌ గుర్తించారు. నగదు ఇతర సామాగ్రీ స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి మండలం మల్లప్పరాజుపల్లిలో 10లక్షలు పట్టుకున్నారు. నగదు తరలిస్తున్న కారును పట్టుకున్నారు BJP కార్యకర్తలు. నాంపల్లి మండలం టిపి గౌరారంలో టిఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతుండగా స్థానికులు పట్టుకున్నారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డికి సంబంధించిన అనుచరుల వాహనాల్లో డబ్బులు తీసుకొచ్చారు. టీఆర్ఎస్ శ్రేణులు ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆరోపిస్తూ.. మర్రిగూడలో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట, గజ్వేల్ టీఆర్ఎస్ నాయకులు స్థానికంగా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ నిలిపివేయాలంటూ వాగ్వాదానికి దిగడంతో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. మర్రిగూడ మండలం అంతపేటలో ఓటర్లు ఆందోళనకు దిగారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ల పార్టీ వాళ్లకే డబ్బులు పంచారని, తమకెందుకు ఇవ్వలేదని ఆందోళన చేశారు.

  ఉప ఎన్నికలో భాగంగా ఈసీ.. సర్వైలో మహిళా మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అందులోని మహిళా సిబ్బంది దిగిన ఓ ఫొటోను ట్విటర్ వేదికగా పోస్టు చేసింది. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా మొత్తం పోలింగ్‌ సరళిని ఈసీ పరిశీలించింది. ఉప ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న 47మంది అభ్యర్థుల భవితవ్యం 6వ తేదీన తేలనుంది.

  Trending Stories

  Related Stories