ముంబై నగరంలో చోటు చేసుకున్న ఓ ఊహించని ప్రమాదం తల్లీబిడ్డకు పెను శాపంగా మారింది. శనివారం నాడు జోగేశ్వరి ఈస్ట్ ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న ఆటోరిక్షాపై సపోర్టింగ్ సీలింగ్ స్లాబ్‌లకు ఉపయోగించే ఇనుప కడ్డీ పడి ఒక మహిళ, ఆమె తొమ్మిదేళ్ల కుమార్తె మరణించారు. ఈ సంఘటన సాయంత్రం 4.15 గంటలకు చోటు చేసుకుంది. చనిపోయిన వారిని షామా బానో ఆసిఫ్ షేక్, ఆమె కుమార్తె ఆయత్ అని గుర్తించారు. ఫరూఖ్ హైస్కూల్ ఫర్ గర్ల్స్ నుండి కుమార్తెను ఇంటికి తీసుకు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే వెంబడి శల్యక్ ఆసుపత్రి సమీపంలో స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీకి చెందిన నిర్మాణంలో ఉన్న భవనం నుండి నాలుగు లేదా ఐదవ అంతస్తు నుండి భారీ వృత్తాకార ఇనుప పైపు ఆటోపై పడింది.
స్థానికులు ఇద్దరినీ జోగేశ్వరి ట్రామా కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మహిళ చనిపోయినట్లు ప్రకటించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చేర్చారు. బాలికకు అంతర్గత రక్తస్రావం ఎక్కువగా ఉందని., తలకు బలమైన గాయాలు ఉన్నాయని.. ఆమెను ఇంట్యూబేట్ చేసి అంధేరీలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ మరణించిందని వైద్యులు తెలిపారు. జోగేశ్వరి పోలీస్ స్టేషన్‌లోని సీనియర్ ఇన్‌స్పెక్టర్ సతీష్ తవారే మాట్లాడుతూ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన బిల్డింగ్ యజమానులపై కేసు నమోదు చేసే ప్రక్రియలో ఉన్నామని తెలిపారు. పైప్ ఏ అంతస్తు నుండి పడిపోయిందో.. మరణానికి కారణమైన వ్యక్తులను వారు ఇంకా గుర్తించలేరు. తల్లీకూతుళ్లిద్దరూ జోగేశ్వరి ఈస్ట్‌లోని ప్రతాప్ నగర్‌లో ఉంటున్నారని, అక్కడ మహిళ భర్త టైలర్‌గా పనిచేస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు.