ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్ మొదటి సీజన్ లో ముంబయి ఇండియన్స్ జట్టు విజేతగా అవతరించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో ఫైనల్లో ముంబయి ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 132 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నాట్ షివర్ 60 పరుగులతో అజేయంగా నిలిచి ముంబయికి విజయాన్ని అందించింది. 55 బంతులు ఎదుర్కొన్న షివర్ 7 బౌండరీలు కొట్టింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఛేదనలో 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ముంబయి ఇండియన్స్ ను నాట్ షివర్, హర్మన్ ప్రీత్ జోడీ ఆదుకుంది. హర్మన్ ప్రీత్ అవుటైనా, మీలీ కెర్ సహకారంతో నాట్ షివర్ ఫినిష్ చేసి ముంబై ఇండియన్స్ కు విజయాన్ని అందించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు మాత్రమే చేసింది. అనవసరమైన షాట్స్, రనౌట్స్ ఢిల్లీ భారీ స్కోరుకు బ్రేకులు వేశాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ మెగ్ లానింగ్ చేసిన 35 పరుగులే అత్యధికం. రాధా యాదవ్ 12 బంతుల్లో 27, శిఖా పాండే 17 పరుగుల్లో 27 పరుగులు చేసి పర్వాలేదనిపించే స్కోరును అందించారు. ముంబయి బౌలర్లలో ఇస్సీ వాంగ్ 3, హేలీ మాథ్యూస్ 3, మీలీ కెర్ 2 వికెట్లు తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును నాట్ షివర్ అందుకోగా.. హేలీ మ్యాథ్యూస్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.