యాప్ లో ముస్లిం మహిళల వేలంపాట.. అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం

0
860

ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ ‘గిట్ హబ్’ వేదికగా కార్యకలాపాలు నిర్వహించే ‘బుల్లి బాయి’ అనే యాప్ లో ముస్లిం మహిళల ఫొటోలు పోస్టు చేస్తూ వారిని వేలం వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మహిళల ఫొటోలు అప్‌లోడ్‌ చేసి.. అమ్మకానికి ఉన్నారంటూ ప్రకటనలు ఇస్తున్న ‘బుల్లీ బాయ్‌’ అనే యాప్‌ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విషయాన్ని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ బుల్లీ బాయ్‌ యాప్‌ బాధితుల్లో ముస్లిం మతానికి చెందిన వందలాది మంది మహిళలు, విద్యార్థినులు, ప్రముఖులు, జర్నలిస్టులు ఉన్నారు. ఇస్మాత్‌ ఆరా అనే జర్నలిస్టు, ప్రియాంక చతుర్వేది వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఢిల్లీ, ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ యాప్‌లను దిగ్గజ టెక్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు చెందిన ‘గిట్‌హబ్‌’ ప్లాట్‌ఫాం ఆధారంగా చేసుకొని రూపొందించారు. బుల్లీ బాయ్‌ను గిట్‌హబ్‌ బ్లాక్‌ చేసిందని కేంద్రమంత్రి అశ్విని వైష్టవ్‌ తెలిపారు.

‘బుల్లి బాయి’ యాప్ లో వేలం వేస్తున్న మహిళల ఫొటోల్లో తనది కూడా అప్ లోడ్ చేశారంటూ ఆయేషా మినాజ్ అనే మహిళా పాత్రికేయురాలు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పట్ల స్పందించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఈ యాప్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని ఊరికే వదలరాదని మండిపడ్డారు. ఇలాంటి చెదపురుగులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ తెలంగాణ సీఎం కార్యాలయాన్ని, మంత్రి కేటీఆర్ ను, తెలంగాణ డీజీపీని, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ను ట్యాగ్ చేశారు. నామమాత్రపు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే సరిపోదని, నిందితులను చట్టం ముందుకు తీసుకురావాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ ఘటనలో తెలంగాణ పోలీసు విభాగంలోని కౌంటర్ ఇంటెలిజెన్స్, యాంటీ రాడికలైజేషన్ దళాల సేవలను వినియోగించుకోవాలని ఒవైసీ సూచించారు.

యాప్‌ల ద్వారా వికృత చర్యలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు డిమాండ్‌ చేశారు. మహిళలను అవమానించడంతో పాటు మత విద్వేషాలకు పాల్పడుతున్న ఈ చర్యలను వ్యతిరేకించాలని, అప్పుడే వాటికి అడ్డుకట్ట పడుతుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు.