కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్కకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. వర్షాలకు, వరదలకు ఏజెన్సీ ప్రాంతాల్లోని చాలా గ్రామాలు ముంపునకు గురై వరదల్లో చిక్కుకున్నాయి. చాలా ప్రాంతాల్లో నివాసాలు చెల్లాచెదురై నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో ముంపు ప్రాంతాల్లో నివసిస్తోన్న ప్రజలకు నిత్యావరసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సీతక్క పడవలో తిరిగి ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో పడవ వాగులోని ఓ చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. వెంటనే విషయం తెలుసుకున్న అధికారులు మరో పడవలో అక్కడికి చేరుకొని సీతక్కను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఎమ్మెల్యేతో పాటు పడవలో ప్రయాణిస్తున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపెల్లిలో వరద ప్రాంతంలో చోటు చేసుకుంది.