More

    టైమ్ మ్యాగజైన్ అత్యంత ప్రభావశీలుర జాబితాలో తాలిబాన్ నేత

    తాలిబన్ నేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌కు టైమ్ మ్యాగజైన్ అత్యంత ప్రభావశీలుర జాబితా-2021లో కూడా చోటు దక్కింది. నిజంగా ఇది ఎవరూ ఊహించని విషయమే..! అందరినీ ఆశ్చర్యపరుస్తూ కరుడుగట్టిన ఉగ్రవాది, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు, ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక ప్రభుత్వ ఉప ప్రధాని ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌కు కూడా టైమ్ మ్యాగజైన్ 100 మంది ప్రభావశీల వ్యక్తుల జాబితాలో చోటు దక్కింది. బైడన్, జిన్‌పింగ్ ఉన్న కేటగిరీలోనే బరాదర్‌కు కూడా చోటు దక్కింది.

    ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడ్డ తాలిబాన్ల ప్రభుత్వానికి ముల్లా అబ్దుల్​ఘనీ బరాదర్​ నేతృత్వం వహించనున్నారు. త్వరలోనే ఆయన అధికార పీఠం ఎక్కడం దాదాపు ఖరారైంది. ఆఫ్ఘన్​ప్రభుత్వాన్ని నడపనున్న ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ తాలిబాన్ల సహ వ్యవస్థాపకుడు. అలాగే ప్రస్తుతం అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్నారు. శాంతి చర్చల్లో తాలిబాన్లకు నాయకత్వం వహించి, అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. 2001లో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్లు అధికారం కోల్పోయాక ముల్లా అబ్దుల్​ఘనీ బరాదర్ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. రెండు దశాబ్దాల తర్వాత ఈ ఏడాది ఆగస్టులోనే తొలిసారి ఆఫ్ఘన్‌లో అడుగుపెట్టారు. 2010లో పాకిస్థాన్ ఆయన్ని అరెస్ట్ చేశాక.. అమెరికా జోక్యంతో 2018లో బరాదర్ విడుదలయ్యారు

    తాలిబాన్ల వ్యవస్థాపకుడు ముల్లా మహమ్మద్​ఒమర్ ప్రేమతో అబ్దుల్ ఘనీని బరాదర్ అని పిలిచేవారు. బరాదర్ అంటే సోదరుడు అని అర్థం. మహమ్మద్ ఒమర్ స్వయంగా తన డిప్యూటీగా నియమించుకున్న వారిలో ప్రస్తుతం ఉన్నది అబ్దుల్​ఘనీ ఒక్కరే. దీంతో బరాదర్ తాలిబాన్ల దిగ్గజంగా మారారు. ముల్లా మహమ్మద్​ ఒమర్​ కుటుంబానికి చెందిన అమ్మాయిని బరాదర్ పెళ్లి చేసుకోవడంతో​బంధువుగానూ మారారు. 2020లో ఖతార్‌లో జరిగిన శాంతి ఒప్పంద చర్చలకు తాలిబాన్ల తరఫున నాయకత్వం వహించారు. అప్పటి అమెరికా రక్షణ మంత్రి మైక్ పాంపియోను కలిసి చర్చించడం సహా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తోనూ బరాదర్ మాట్లాడారు. గత నెల కాబుల్​ను స్వాధీనం చేసుకున్నాక అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రసంగిస్తూ ఆప్ఘన్‌లో విజయం సాధిస్తామని అనుకోలేదనీ, అయితే తమకు పరీక్ష ఇప్పుడే మొదలైందని చెప్పారు. దేశాన్ని కాపాడడంతో పాటు స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సవాళ్లు తమ ముందున్నాయని అన్నారు. 1996 నుంచి 2001 మధ్య ఆఫ్ఘన్‌లో తాలిబాన్ల ప్రభుత్వంలో అబ్దుల్ ఘనీ బరాదర్ రక్షణ శాఖ డిప్యూటీ మంత్రిగా పని చేశారు. గత నెల రోజులుగా చోటు చేసుకున్న ఘటనల కారణంగా ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీలురు జాబితాలో బారాదర్ పేరు వచ్చి చేరింది.

    ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీలురు జాబితాలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, కొవిషీల్డ్ టీకాలు ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత జిన్‌పింగ్, ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మర్కెల్ తదితరులకు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది. ‘74 సంవత్సరాల స్వాతంత్య్ర భారతంలో ముగ్గురు శక్తిమంతమైన నాయకులు ఉన్నారు. వారు జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, మోదీ. నెహ్రూ, ఇందిర తర్వాత భారత రాజకీయాలను శాసిస్తున్నది మోదీయే’ అని ‘టైమ్‌’ పేర్కొంది.

    Trending Stories

    Related Stories