More

    ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలివే

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆదివారం ఉదయం ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి దాటాక పూర్తయింది. రాత్రి రెండు గంటల సమయంలో అధికారులు ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 7,219 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగ్గా 5,998 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. 826 స్థానాల్లో టీడీపీ విజయం సాధించగా, జనసేన 177, బీజేపీ 28, సీపీఎం 15, సీపీఐ 8, స్వతంత్రులు 157 స్థానాల్లో విజయం సాధించారు. 515 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా వైసీపీ 502, టీడీపీ 6, జనసేన 2, సీపీఎం, స్వతంత్రులు చెరో స్థానంలో విజయం సాధించారు.

    మండల, జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వారి ఎన్నికకు ఎస్ఈసీ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక జరగనుంది. అనంతరం ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక చేపట్టనున్నారు. ఈ మేరకు ఎన్నికకు ఏర్పాట్లు చేయాలని ఎస్ఈసీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.

    పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి అఖండ విజయం సాధ్యమైందని తెలిపారు. ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని పేర్కొన్నారు. సోమవారం ఉదయం కల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ పూర్తి ఫలితాలు వస్తాయని సీఎం జగన్ వెల్లడించారు. పూర్తి ఫలితాలు వచ్చాక మరోసారి అందరికీ వీడియో సందేశం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటానని ట్వీట్ చేశారు.

    Trending Stories

    Related Stories