భోపాల్ పార్లమెంటు సభ్యురాలు సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్‌కు అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు పంపినందుకు ఇద్దరు యువకులను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసినట్లు హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ నివేదించింది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని సిక్రీలో సదరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ రిమాండ్‌పై భోపాల్‌కు తీసుకువచ్చారు. సైబర్ క్రైమ్ కేసులో భాగంగా నిందితులను రాజస్థాన్‌లో పట్టుకుని మధ్యప్రదేశ్ పోలీసులకు అప్పగించినట్లు భరత్‌పూర్ ఐజి ప్రసన్న కుమార్ ఖమేస్రా తెలిపారు. సుమారు 8 రోజుల క్రితం, తన పరువు తీయడానికి మరియు తన ప్రతిష్టను చెడగొట్టడానికి కుట్ర పన్నారని ఆరోపిస్తూ భోపాల్‌లోని టిటి నగర్‌లో ఎంపీ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.
నిందితులైన రవీన్ (23), అతని సోదరుడు వారిస్ (21) చదువుకోకపోయినా సైబర్ క్రైమ్ చేయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారని పోలీసులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం భోపాల్ సబ్ ఇన్‌స్పెక్టర్ దేవేంద్ర సాహు, అతని బృందం సిక్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. నిందితులిద్దరి జాడ కోసం సైబర్ సెల్‌ను రంగంలోకి దించారు. ఫోన్ రికార్డుల ఆధారంగా నిందితుల కదలికలను పోలీసులు తెలుసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో, భోపాల్- సిక్రి నుండి పోలీసులు చందా కా బస్ బన్ని కుగ్రామానికి చేరుకుని ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
తనకు అభ్యంతకర వీడియోలను పంపుతూ, బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనపై ప్రగ్యా ఠాకూర్ ఫిబ్రవరి 7 న సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా అనేక మందిని బలితీసుకున్న న్యూడ్ వీడియో కాల్ బ్లాక్‌మెయిలింగ్ రాకెట్‌లో తాను బాధితురాలిని అని ఆరోపించింది. ఫిబ్రవరి 6న రాత్రి 7 గంటలకు తన వాట్సాప్‌లో వీడియో కాల్ వచ్చిందని ఠాకూర్ తెలిపారు. ఆమె ఫిర్యాదు ప్రకారం, ఆమెకు వీడియో కాల్ చేసిన ఒక మహిళ తన బట్టలు విప్పేసింది, ఆ తర్వాత ఎంపీ కాల్ డిస్‌కనెక్ట్ చేసింది.
కొంత సమయం తరువాత, తన నుండి డబ్బులు డిమాండ్ చేస్తూ వేరే నంబర్ నుండి కాల్ వచ్చిందని, డబ్బు చెల్లించకుంటే ఆ అమ్మాయితో ఎంపీ మాట్లాడిన వీడియోను పబ్లిక్‌గా పెడతానని బెదిరించారని ప్రగ్యా ఠాకూర్ చెప్పారు. ఈ ఆన్‌లైన్ గ్రూప్ తన నుంచి డబ్బలు వసూలు చేసేందుకు ‘న్యూడ్ వీడియో కాల్’ వ్యూహాన్ని ఉపయోగించిందని ఆమె తెలిపారు. ఈ సంఘటన తరువాత ఆమె టిటి నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఇలాంటి కాల్, వీడియోలు తన పరువు తీయడానికి, తన ప్రతిష్టను పాడుచేసే కుట్రలో భాగమని చెప్పారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 354 (లైంగిక వేధింపులు), 507 (అనామక సంభాషణ ద్వారా నేరపూరిత బెదిరింపు), సెక్షన్ 509 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.