దేశంలో హజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా వివాదం కొనసాగుతూనే ఉంది. అలాగే మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తానంటూ ఎంపీ నవనీత్ కౌర్ చేసిన ప్రతిజ్ఞ మరో సంచలనానికి తెర తీసింది. ఈ విషయంలో నవనీత్ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.
తాజాగా పార్లమెంట్ సభ్యురాలు నవనీత్ కౌర్ రాణా దంపతులకు బెయిల్ మంజూరు అయింది. నవనీత్ కౌర్, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాలను షరతులతో కూడిన బెయిల్‌పై విడుదల చేసేందుకు సెషన్స్ కోర్టు అనుమతించింది. అయితే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తానని చెప్పడంతో పోలీసులు నవనీత్ రాణా దంపతులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి 10 రోజుల తర్వాత నవనీత్ కౌర్ దంపతులకు ముంబై సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
నవనీత్ రాణా దంపతులు.. ఏప్రిల్ 23న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసా పఠించనున్నట్టుగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రధాని మోదీ ముంబై పర్యటన నేపథ్యంలో దానిని విమరించుకుంటున్నట్టుగా నవనీత్ కౌర్ దంపతులు తెలిపారు. అనంతరం మహారాష్ట్ర పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
అయితే దేశద్రోహం, శత్రుత్వాన్ని ప్రోత్సహించారనే ఆరోపణలపై ముంబై పోలీసులు తమపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నవనీత్ దంపతులు కోర్టును ఆశ్రయించారు.ఈ క్రమంలోనే బుధవారం స్పెషల్ జడ్జి ఆర్ఎన్ రోకడే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఒక్కొక్కరు రూ. 50,000 పూచీకత్తును సమర్పించాలని బెయిల్ షరతుల్లో వెల్లడించారు. అంతే కాకుండా మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించారు. కేసు విచారణకు ఆటంకం కలిగించకూడదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, బెయిల్‌ను రద్దు చేసేలాంటి క్రిమినల్ నేరానికి పాల్పడకూడదని తెలిపారు. మరోవైపు వారిని విచారించాలంటే.. 24 గంటల ముందుగా నోటీసులు ఇవ్వాలని పోలీసు శాఖను కోర్టు ఆదేశించింది.