ప్రధాని మోదీపై ఎంపీ అసదుద్దీన్ తీవ్ర ఆరోపణలు..!

0
270

ప్రధాని నరేంద్రమోదీపై అఖిల భారత మజ్లిస్‌ ఎ ఇత్తేహదుల్‌ ముస్లిమీన్‌ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి విమర్శలు చేశారు. నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం విషయంలో ప్రధాని నరేంద్రమోదీ అనుసరించిన వైఖరిని అసదుద్దీన్‌ ఓవైసీ తప్పుపట్టారు. నూతన పార్లమెంట్‌ ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కేవలం ఒక మతానికి చెందిన వారిని మాత్రమే లోపలికి రానిచ్చారని ఒవైసీ ఆరోపించారు. ప్రధాని తీరు సరైనది కాదని ఆయన విమర్శించారు. మోదీ కేవలం హిందువులకు మాత్రమే ప్రధాని కాదని, 130 కోట్ల మంది భారతీయులందరికీ ప్రధాని అని అన్నారు. కాబట్టి ఆయన అన్ని మతాల వారిని పార్లమెంటు లోపలికి తీసుకెళ్తే బాగుండేదని అన్నారు.

అంతకు ముందు సంగారెడ్డి జిల్లా సదాశివ పేటలో ఓ కార్యక్రమంలో కూడా అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని అసదుద్దీన్ సవాలు విసిరారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామని టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. బీజేపీ నేతలు తరచూ పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రయిక్‌ చేస్తామని అంటున్నారని.. వారికి దమ్ముంటే భారతదేశ భూభాగంలోకి చొచ్చుకువస్తున్న చైనాపై సర్జికల్‌ స్ట్రయిక్‌ చేయాలని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ మైనార్టీలపై వివక్ష చూపిస్తున్నారని.. మైనార్టీ నాయకులను హత్య చేస్తున్నారని ఓవైసి విమర్శించారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు మైనార్టీలను ఓటుబ్యాంకుగా వాడుకుంటున్నాయని అన్నారు.