శ్రీలంకలో ఆందోళనకారులు రెచ్చిపోతూ ఉన్నారు. అధికార పార్టీ నేతలపై విరుచుకుపడుతూ ఉన్నారు. కొలంబో రాజధాని వెలుపల నిట్టంబువా ప్రాంతంలో ఆందోళనకారులు భారీ ఎత్తున గుమికూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆ సమయంలో ఎంపీ అమరకీర్తి అతుకోరల తన కారులో అక్కడికి వచ్చారు. ఎంపీని చూడగానే ఆగ్రహంతో ఆందోళనకారులు ఆయన కారును చుట్టుముట్టారు. దాంతో ఎంపీ తుపాకీ తీసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళనకారుల నుంచి తప్పించుకుని సమీపంలోని భవనంలో ఆశ్రయం పొందేందుకు ఎంపీ అమరకీర్తి ప్రయత్నించారు. కాసేపటి తర్వాత ఆయన శవమై కనిపించారు. తన తుపాకీతో తానే కాల్చుకున్నట్టు భావిస్తున్నారు. అదే సమయంలో ఆయన సెక్యూరిటీ గార్డు కూడా చనిపోయి కనిపించాడు. ఎంపీ కాల్పుల్లో గాయపడిన పౌరుల్లో ఒకరు మరణించారు. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక గ్రూపుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కేనన్లు ప్రయోగించాల్సి వచ్చింది. కొలంబోలో కర్ఫ్యూ ప్రకటించారు.
“ఎంపీ అమరకీర్తి తుపాకీతో ఆందోళన కారులను కాల్చి.. అక్కడి నుండి పారిపోయి సమీపంలోని భవనంలో ఆశ్రయం పొందాడు” అని ఒక పోలీసు అధికారి మీడియాకు చెప్పారు. “వేలాది మంది భవనాన్ని చుట్టుముట్టారు. ఆ సమయంలో అతను తన రివాల్వర్‌తో తన ప్రాణాలను తీసుకున్నాడు.” అని చెప్పుకొచ్చారు పోలీసులు. వేలాది మంది వీధుల్లోకి వచ్చి, ప్రధాన మంత్రి మహింద రాజపక్సే మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. రాజధాని కొలంబోలో జరిగిన హింసాకాండలో కనీసం 138 మంది గాయపడి కొలంబో నేషనల్ హాస్పిటల్‌లో చేరారని ఆసుపత్రి అధికార ప్రతినిధి తెలిపారు.
సోమవారం సాయంత్రం శ్రీలంక శాసనసభ్యులు, మాజీ మంత్రి ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మౌంట్ లావినియాలోని మాజీ మంత్రి జాన్స్టన్ ఫెర్నాండో నివాసం, ఎంపీ సనత్ నిశాంత ఇంటిపై ఆందోళనకారులు దాడి చేసి నిప్పు పెట్టారు. సోమవారం కర్ఫ్యూను లెక్కచేయకుండా వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. ప్రధాన మంత్రి మహీందా రాజపక్స రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
మహింద రాజపక్ష రాజీనామా:
శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. శ్రీలంక తీవ్రమైన ఆర్థిక, ఆహార సంక్షోభంలో మునిగిపోవడానికి దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ఆయన సోదరుడు, ప్రధాని మహింద రాజపక్సనే కారణమని శ్రీలంక ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. ఆందోళనకారులు అధ్యక్షుడు, ప్రధాని అధికార నివాసాలపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు.