More

    అధికారులు నిజంగా కొడతారా..? నిజం చెప్పాలని హింసిస్తారా..? ED, IT రైడ్స్‎పై 10 Facts..!

    ప్రస్తుతం తెలంగాణలో ఈడీ, ఐటీ పేర్లు మారుమోగుతున్నాయి. అవినీతి కొండలపై ఈ రెండు సంస్థలు కొరఢా ఝళిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‎లో ఎమ్మెల్సీ కవిత పేరు బయటికొచ్చినప్పటి నుంచి రాష్ట్రంపై వీటి నిఘా మరింత పెరిగింది. తాజాగా తెలంగాణ మంత్రుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్న అధికారులు.. కోట్లాది నోట్ల కట్టలు, కేజీల కొద్ది బంగారం వెలికి తీస్తున్నారు. అయితే, ఈ దాడులకు కొందరు వక్రభాష్యం చెబుతున్నారు. మరికొందరు రాజకీయ రంగు పులుముతున్నారు. కేంద్రం పనిగట్టుకుని దాడులు చేయిస్తోందని రాష్ట్ర నాయకులు గగ్గోలు పెడుతున్నారు. అయితే, ఈ వక్రభాష్యాలు, ఆరోపణల మాట ఎలా ఉన్నా.. ఐటీ దాడుల సందర్భంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన మాటలు మాత్రం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతేకాదు, ఈడీ, ఐటీ దాడులపై సామాన్యుల్లోనూ అనేక అనుమానాలకు తావిచ్చాయి.

    తన కుమారుడిని ఐటీ అధికారులు కొట్టారని.. తీవ్రంగా హింసించారని.. అందుకే గుండె నొప్పితో ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చిందన్నది.. మల్లారెడ్డి ఆరోపణ. మరి, నిజంగా ఈడీ, ఐటీ అధికారులు కొడతారా..? నిజం చెప్పకపోతే హింసిస్తారా..? అసలు రికవరీ చేసిన సొమ్మును ఏం చేస్తారు..? ఎలాంటి ప్రాపర్టీని సీజ్ చేయవచ్చు..? సీజ్ చేయకూడని ఆస్తులకు కూడా ఉంటాయా..? సీజ్ చేసిన ప్రాపర్టీని తిరిగి ఉపయోగించుకోవచ్చా..? ఒక వ్యక్తిపైగానీ, ఒక సంస్థపై గానీ దాడులు జరపడానికి ముందస్తు సమాచారం ఎలా సేకరిస్తారు..? దాడులను ఏ స్థాయి అధికారులు నిర్వహిస్తారు..? ఈ అంశాలన్నీ తెలుసుకుందాం. కానీ, ముందు మీరు చేయాల్సింది గుర్తుంది కదా మిత్రులారా..? నేషనలిస్ట్ హబ్ తో పాటు.. మిగతా అన్ని గ్రూపు చానెళ్లను సబ్ స్క్రయిబ్ చేసుకోండి. ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయడం, పదిమందికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.

    ఇక, విషయంలోకి వెళ్దాం. ఐటీ, ఈడీ దాడుల గురించి తెలుసుకోవాలంటే.. అంతకంటే ముందు మనం నల్లధనం గురించి తెలుసుకోవాలి. సాధారణంగా ధనికులు ప్రతిఏటా ఆదాయపు పన్నును విధిగా ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది. ఏడాది మొత్తంలో సంపాదించిన ఆస్తి అంతటికీ సరైన లెక్కలు చూపి దానికి సంబంధించిన టాక్స్ కట్టాలి. అయితే చాలామంది ప్రభుత్వాలకు పన్నులు ఎగ్గొడుతుంటారు. ఆ సొమ్మును లెక్కల్లోంచి మాయం చేస్తుంటారు. లాభాలను తక్కువ చేసి చూపిస్తారు. ఈ విధంగా పన్ను కట్టకుండా దాచి ఉంచిన డబ్బునే నల్లధనం అంటారు. ఎక్కువగా పన్ను ఎగవేసిన సంపదనంతా డబ్బు రూపంలో కానీ, బంగారం రూపంలో కానీ, స్థిరాస్తుల రూపంలో కానీ దాచిపెట్టే అవకాశముంది. దీంతో పాటు కొన్ని సంస్థలు అక్రమ మార్గంలో హవాలా చేసి ఆస్తులను కూడగడుతాయి. షెల్ కంపెనీల ద్వారా ఇటువంటి అక్రమాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలాంటి అక్రమ ధనాన్నే బ్లాక్ మనీగా ప్రభుత్వం గుర్తిస్తుంది.

    ఈడీ గానీ, ఐటీ గానీ అలాంటి అక్రమ సొమ్మును గుర్తించి సోదాలు చేస్తుంది. అయితే, అంతకంటే ముందు వ్యక్తి లేదా సంస్థకు సంబంధించి సంపూర్ణ సమాచారం సేకరిస్తుంది. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆధారాలన్నిటినీ ముందస్తుగానే కూడగడుతుంది. ఇన్‎కంట్యాక్స్ డిపార్ట్ మెంట్, ఇంటిలిజెన్స్ డిపార్ట్ మెంట్ లతో సంపూర్ణమైన సమాచారం స్వీకరించేందుకు ఈడీకి అధికారాలుంటాయి. ఈ ఆధారాలు సేకరించడానికి కొన్నిసార్లు నెలల తరబడి సమయం పట్టే అవకాశముంటుంది. ముందస్తు సమాచారం పక్కాగా సేకరించిన తర్వాత అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే ఆ సంస్థ లేదా వ్యక్తిపై అయినా దాడులు జరుపుతుంది.

    ఇన్‎కం టాక్స్ యాక్ట్ సెక్షన్ 132(1) ప్రకారం ఐటీ రైడ్స్ చేయడానికి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ స్థాయి నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు అధికారాలుంటాయి. సంబంధిత ప్రాపర్టీలపై పూర్తి సమాచారం సేకరించిన తర్వాత ఏయే ప్రాపర్టీలపై దాడులు చేయాలి..? ఏ సమయంలో చేయాలి..? అనే దానిపై వీరికి సంపూర్ణ నిర్ణయాధికారం ఉంటుంది. దాడులకు సంబంధించిన టీమ్‎ను ఏర్పాటు చేయడం, ఎప్పుడెప్పుడు ఎవరిపై దాడులు చేయాలనే దానిపై ఆదేశాలిచ్చే అధికారం వీరికి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ బయటకు పొక్కుతుందేమో అనే అనుమానాలుంటే,.. తమ కింది స్థాయి అధికారులకు కూడా దాడులు జరిపే సమయంలోనే చెప్పవచ్చు. దీంతో పాటు వీరు దాడులు చేసేటప్పుడు రక్షణ అవసరమనిపిస్తే స్థానిక పోలీసులకు దాడుల లొకేషన్ చెప్పకుండా రక్షణ అందించమనే ఆదేశాలు జారీ చేసే అధికారం కూడా వీరికి ఉంటుంది.

    మరి ఈడీ అధికారులు దాడులు చేసే సమయంలో ఏవైనా ప్రత్యేక అధికారాలుంటాయా అన్న విషయానికొస్తే.. వీరికి ఎటువంటి ఆస్తులపైనైనా సోదాలు జరిపే అధికారం ఉంటుంది. బిల్డింగ్ లు , ఫ్యాక్టరీలు, కంపెనీలలో సోదాలు జరిపేందుకు సంపూర్ణ అధికారాలుంటాయి. ఈ దాడులకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ కేంద్రం నుంచి గానీ ప్రత్యేక అనుమతులేవీ అవసరం లేదు. సోదాలు జరిపే సమయంలో పుస్తకాలు, డాక్యుమెంట్లు, డబ్బు, బంగారం, నగలతో పాటు విలువైన వస్తువులన్నిటినీ పరిశీలించవచ్చు. దీంతో పాటు ఇంట్లోని లాకర్లను తెరవడానికి నిరాకరిస్తే వాటిని కూడా సీజ్ చేయగలిగే అధికారం ఈడీకి ఉంటుంది. ఇక సోదాలు జరపాలనుకున్న ఆస్తులకు గానీ బిల్డింగులకు గానీ తాళం వేసుంటే వాటిని పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించే అధికారముంటుంది. దీంతో పాటు అప్పటికే ఇంట్లో ఉన్న వ్యక్తులను కూడా వ్యక్తిగతంగా సోదాలు నిర్వహించవచ్చు. వారి షర్టు ప్యాంటుల్లోని వస్తువులను కూడా పరిశీలించే హక్కు అధికారులకుంటుంది. అంతేకాదు, ఇంట్లోని విలువైన ఆస్తి పత్రాలనును అవసరమైతే జిరాక్స్ కాపీలు తీసుకునేందుకు అధికారాలుంటాయి.

    ఈడీ అధికారులు ఎటువంటి ఆస్తులు సీజ్ చేయవచ్చు..? వేటిని సీజ్ చేయడానికి వీలుండదు అనే విషయానికొస్తే.. సాధారణంగా ఈడీ సోదాల్లో అన్ని ఆస్తులనూ సీజ్ చేయడానికి అవకాశం ఉండదు. కేవలం లెక్కల్లో చూపని ఆస్తులను, అవినీతి జరిగిందని నిరూపించే ఆస్తులను మాత్రమే సీజ్ చేయడానికి వీలుంటుంది. వీటిలో డబ్బు, బంగారం, ఆస్తులకు సంబంధించిన అకౌంట్ పుస్తకాలు, చలాన్లు, డైరీలు, కంప్యూటర్ చిప్ లు డేటా స్టోరేజీ డివైస్ లు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను సీజ్ చేయడానికి అనుమతి ఉంటుంది. అయితే వీటిలో కొన్నింటిని సీజ్ చేయడానికి ఈడీకి అనుమతి ఉండదు. ఇందులో బిజినెస్ స్టాక్స్ లను, ఇన్ కం ట్యాక్స్ లెక్కల్లో చూపిన డబ్బులను, ప్రతియేటా ఆదాయపు పన్ను శాఖ దగ్గర వెల్లడించిన ఆస్థులను ఈడీ అటాచ్ చేయడానికి వీలుండదు. దీంతో పాటు బంగారాన్ని కూడా పూర్తిగా సీజ్ చేయడానికి వీలుపడదు. పెళ్ళైన మహిళలుంటే ఒక్కొక్కరికీ 500 గ్రాముల చొప్పున బంగారం, పెళ్ళికాని మహిళలుంటే 250 గ్రాములు, పురుషులకు 100 గ్రాముల బంగారాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది.

    ఇక ఈడీ అధికారులు దాడులు చేసేటప్పుడు ఇంట్లోని వ్యక్తులు ఏవిధంగా నడుచుకోవాల్సి ఉంటుందనే దానిపై కూడా కొన్ని నిబంధనలున్నాయి. ఈడీ అధికారులు సోదాలు నిర్వహించే సమయంలో వారి విధులకు ఆటంకం కలిగించేలా ఏ విధమైన అడ్డంకులూ సృష్టించకూడదు. అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాలి. దీంతో పాటు సోదాల సమయంలో ఇంట్లో ఉన్న వ్యక్తులందరినీ ఉన్న సంబంధమేంటో యజమాని చెప్పాలి. ఒకవేళ అడిగిన వ్యక్తి గురించి తప్పుడు సమాచారం ఇచ్చినా,.. లేక ఒక వ్యక్తిని వేరే వ్యక్తిగా పరిచయం చేసినా కూడా ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 416 ప్రకారం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. దీంతో పాటు సోదాలు జరిగే సమయంలో ఎటువంటి కాల్స్ మాట్లాడాల్సి వచ్చినా అధికారుల అనుమతితోనే మాట్లాడాలి. దర్యాప్తు అధికారులతో యజమాని పూర్తిగా సహకరించాలి. ఇక ఈడీ సోదాలు జరిపే సమయంలో కూడా యజమాని కొన్ని హక్కులను కలిగి ఉంటాడు. సోదాలు జరిపే సమయంలో మహిళలను చెక్ చేసేటప్పుడు మహిళా అధికారితోనే చెక్ చేయించమని కోరే హక్కు ఉంటుంది. హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే స్వంత డాక్టర్ ను పిలిపించుకునే వీలుంటుంది. ఇక స్కూలుకు వెళ్ళేపిల్లలు ఇంట్లో ఉంటే వారి బ్యాగులను చెక్ చేసిన తర్వాత వదిలిపెట్టేందుకు కోరే హక్కు ఉంటుంది. వీటితో పాటు తమ సీజ్ చేసిన డాక్యుమెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్లకు సంబంధించిన జిరాక్స్ కాపీలను అడిగి తీసుకునే హక్కు ఉంటుంది.

    ఇక ఈడీ సోదాల్లో సీజ్ అయిన ఆస్తులను సంబంధిత వ్యక్తులు కోర్టుల్లో న్యాయపోరాటం చేసి విడిపించుకోవాలి. వారి ఆస్థులకు సంబంధించి ఏ విధమైన అవకతవకలు జరగలేదనీ లెక్కలు చూపించి నిరూపించాల్సి ఉంది. అయితే కోర్టుల్లో న్యాయపోరాటాలంటే సుదీర్ఘసమయం పడుతుంది. కొన్నిసార్లు ఈ పోరాటాలు ఏళ్ళతరబడీ కొనసాగుతాయి. దీంతో సీజ్ చేసిన ఆస్తులు నష్టపోయే అవకాశముంటుంది. వేల మందికి ఉపాధి కల్పించే ఫ్యాక్టరీలు, ట్రాన్స్‎పోర్ట్ వాహనాలు, షాపింగ్ కాంప్లెక్స్‎లను సీజ్ చేస్తే అవి న్యాయపోరాటం జరిగే సమయంలో వాటి ప్రాభవాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. వాహనాలు తుప్పుపట్టడం, షాపింగ్ కాంప్లెక్స్ లకు అంతకుముందున్న డిమాండ్ ను కోల్పోవడం, ఇండస్ట్రీలు మూత పడితే కార్మికులు నష్టపోవడం లాంటివి జరుగుతాయి. అయితే ఇటువంటి ఆస్తులను సీజ్ చేసినప్పుడు కోర్టుల వద్ద యజమానులు ప్రత్యేక అధికారాలు పొందవచ్చు. వీటి నుంచి వచ్చే లాభాలను నష్టపోతామని, కార్మికులు నష్టపోతారనీ కోర్టుల్లో నిరూపిస్తే,.. కోర్టులు తమ విచక్షణా పరిమితులతో సీజ్ చేసిన ఆస్థులను యధావిధిగా ఉపయోగించేందుకు అవకాశం కల్పిస్తాయి. అయితే వీటికి సంబంధించిన లావాదేవీలపై కోర్టులు ఆంక్షలు విధిస్తాయి. ఈ విధంగా ఈడీ అధికారులు పలు ఆస్తులను అటాచ్ చేయడానికి, వాటిని జప్తు చేయడానికి ప్రత్యేక అధికారాలను కలిగి ఉంటారు. ఇవీ, ఈడీ, ఐటీ దాడులకు సంబంధించిన ప్రొటోకాల్స్. అంతేగానీ, చేయిచేసుకోవడాలు, హింసించడాలు, కొట్టడాలు ఉండవు. అలా ఎవరైనా ఆరోపించారంటే.. అది రాజకీయ ప్రయోజనమే తప్ప.. వాస్తవం కాదన్నది పచ్చి నిజం.

    Related Stories