ఉక్రెయిన్‌లో 3,000 మందికి పైగా భారతీయ విద్యార్థులను బందీలుగా ఉంచినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం తెలిపారు. చైనా విద్యార్థులను కూడా బందీలుగా ఉంచుతున్నారని ఆయన అన్నారు. “ఉక్రెయిన్ విదేశీయుల తరలింపును ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తోంది, దీని కారణంగా వారు బెదిరింపులకు దిగనున్నారు” అని పుతిన్ తెలిపారు. యుద్ధంలో 500 మంది రష్యా సైనికులు చనిపోయినట్టు ఆ దేశం ప్రకటించింది 1600 మంది గాయపడినట్టు తెలిపింది. తాము 6 వేల మంది రష్యన్ సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ ప్రకటించగా.. దీనిని ఖండిస్తూ రష్యా ఈ ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌లోని కీలకమైన ఖేర్సన్ ఓడరేవును పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నట్టు రష్యా ప్రకటించింది. ఓడరేవు పాలనా యంత్రాంగాన్ని కూడా రష్యా అదుపులోకి తీసుకున్నట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మరియుపొల్, ఖార్ఖివ్ నగరాలను కూడా రష్యా దక్కించుకుంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భారత ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత భారతీయ విద్యార్థులు వారు ఉన్న ప్రాంతాల నుంచి కదలడానికి రష్యా సైనికులు సాయం చేస్తున్నారు. భారతీయులను ఉక్రెయిన్ సైన్యం కిడ్నాప్ చేసిందని రష్యా రక్షణశాఖ చెబుతోంది. ఖార్ఖివ్ లో ఇండియన్ స్టూడెంట్స్ ను ఉక్రెయిన్ బలగాలు బందీలుగా చేసుకున్నాయని తెలిపింది. తమకున్న సమాచారం ప్రకారం భారతీయ విద్యార్థులను పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ బలగాలు బలవంతంగా తమ అధీనంలో ఉంచుకున్నాయని రష్యా మిలిటరీ అధికార ప్రతినిధి తెలిపారు. తమ విద్యార్ధులను బంధించారనే విషయం గురించి ఇప్పటి వరకు తమకు ఎలాంటి రిపోర్టులు రాలేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బగ్చి స్పష్టం చేశారు. ఖార్ఖివ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భారత విద్యార్థులు ఉక్రెయిన్ దక్షిణ సరిహద్దులకు చేరుకునేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ఆ దేశ అధికారులను కోరామని చెప్పారు. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులతో అక్కడున్న ఇండియన్ ఎంబసీ నిరంతరం టచ్ లో ఉందని విదేశాంగ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ అధికారుల సాయంతో ఖార్ఖివ్ నుంచి చాలా మంది విద్యార్థులు వెళ్లిపోయారని చెప్పింది. ఉక్రెయిన్ బలగాల చేతిలో ఏ ఒక్క విద్యార్థి కూడా బందీగా ఉన్నట్టు తమకు సమాచారం లేదని తెలిపింది.