National

భారత్ లో మంకీ పాక్స్ కలకలం.. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్న కేంద్రం

ప్రపంచ ఆరోగ్య సంస్థ.. మంకీపాక్స్‌ను గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత్‌లో సైతం మంకీపాక్స్‌ కేసులు పెరుగుతుండటం టెన్షన్‌ పెడుతోంది. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో మరో పాజిటివ్‌ కేసు నమోదు అయ్యింది. దీంతో దేశంలో మంకీపాక్స్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఢిల్లీలో 34 ఏళ్ళ వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. బాధితుడు విదేశాల్లో పర్యటించలేదని అధికారులు స్పష్టం చేశారు. అతడు ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీలో ఓ స్టాగ్ పార్టీ (పురుషులు మాత్రమే హాజరయ్యే పార్టీ)కి హాజరైనట్టు తెలిసింది. అతడిని మౌలానా అజాద్ మెడికల్ కాలేజీలో చేర్చి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అతడు జ్వరం, చర్మంపై దద్దుర్లతో బాధపడ్డాడని.. దీంతో శాంపిళ్ళను పూణెలోకి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ వైరాలజీకి పంపగా మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు వివరించారు. శనివారం వరకు దేశంలో మూడు మంకీపాక్స్‌ కేసులు వెలుగు చూశాయి. మూడు కూడా కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి.

ఇలాంటి తరుణంలో నేడు ఉన్నతస్థాయి సమావేశానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాయత్తమైంది. ప్రపంచ దేశాల్లో మంకీపాక్స్ కేసుల గురించి, దేశంలో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Related Articles

Back to top button