యూపీకి పాకిన మంకీపాక్స్.. ఐదేళ్ల చిన్నారికి లక్షణాలు

0
710

కేరళలో మొదలైన మంకీపాక్స్ క్రమంగా.. దేశంలోని రాష్ట్రాలకు విస్తరిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ (యూపీ)లో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఐదేళ్ల చిన్నారిలో మంకీపాక్స్ లక్షణాలను గుర్తించారు. చిన్నారి శరీరంపై దద్దుర్లు, బొబ్బలు రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు బాలికను ఐసోలేషన్ లో ఉంచి.. ఆమె నుంచి సేకరించిన నమూనాలను పరీక్షకు పంపించారు. అయితే.. చిన్నారికి మంకీపాక్స్ సోకిందన్నది కేవలం అనుమానం మాత్రమేనని, ముందుజాగ్రత్తగా నమూనాలను పరీక్షకు పంపామని.. ఎవరూ ఆందోళన చెందవద్దని ఘజియాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఒకరు తెలిపారు.

అలాగే చిన్నారిలో మరేఇతర అనారోగ్య సమస్యలు కనిపించలేదని, గడిచిన నెలరోజుల్లో ఆమె కుటుంబసభ్యులు ఎలాంటి దేశీ, విదేశీ పర్యటనలు చేయలేదని అధికారులు వివరించారు. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో 700 మందికి మంకీపాక్స్ సోకినట్లు సమాచారం. అమెరికాలోని 11 రాష్ట్రాల్లో 21 కేసులు బయటపడగా.. కెనడాలో 77 కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్స్ లో శుక్రవారం ఒక్కరోజే 51 మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ.. మంకీపాక్స్ కేసులు బయటపడుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఫోర్త్ వేవ్ లో కరోనా విజృంభిస్తే.. మళ్లీ లాక్ డౌన్ తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here