ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ప్రభుత్వ అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు బుధవారం నాడు కర్ణాటక వ్యాప్తంగా దాడులు నిర్వహించారు. 60 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న 15 మంది ప్రభుత్వ అధికారుల నివాసాలు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు.
ఎసిబి వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వ అధికారులు వారి ఆదాయానికి మించి భారీ ఆస్తులను సంపాదించుకున్నారని.. అందుకు సంబంధించిన పత్రాలను కనుగొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఆర్టీఓ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, జాయింట్ డైరెక్టర్, ఫస్ట్ డివిజన్ క్లర్క్ (ఎఫ్‌డిసి) మరియు ‘డి’ గ్రూప్ ఉద్యోగులపై ఈ దాడులు నిర్వహిస్తున్నారు. ఈ అధికారులు రెవెన్యూ శాఖ, BBMP, వ్యవసాయ శాఖ మరియు PWD లలో పనిచేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫిజియోథెరపిస్ట్‌ల నివాసాలపై కూడా దాడులు నిర్వహించారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు.

యలహంక ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్న రాజశేఖర్ బెంగళూరు సమీపంలోని దొడ్డబల్లాపూర్ తాలూకాలో మూడు బీడీఏ స్థలాలు, రెండు రెవెన్యూ స్థలాలు, ఐదెకరాల భూమిని కొనుగోలు చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. వీరిపై ఎసిబికి ఫిర్యాదులు అందడంతో దాడులు నిర్వహించారు.

మంగళూరు స్మార్ట్ సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కెఎస్ లింగేగౌడ, మాండ్య ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ కె, దొడ్డబళ్లాపుర రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనరశిమయ్య, బెంగళూరు నిర్మాణ కేంద్రం మాజీ ప్రాజెక్ట్ మేనేజర్ వాసుదేవ్, బెంగళూరు నందిని డెయిరీ జనరల్ మేనేజర్ బి కృష్ణారెడ్డికి చెందిన చోట్ల దాడులు నిర్వహించినట్లు బ్యూరో తెలిపింది. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ టిఎస్ రుద్రేశప్ప, బైలహోంగళ సహకార అభివృద్ధి అధికారి ఎకె మస్తీ ఇళ్లపై కూడా దాడులు నిర్వహించారు. వారి నుంచి ఆస్తులకు సంబంధించిన పత్రాలు, భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలు, నగదు, పెట్టుబడి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఓ ఇంటి డ్రైనేజీ పైపు, సీలింగ్‌లో దాచిన రూ.50 లక్షలకు పైగా నగదు కట్టలను ఏజెన్సీ స్వాధీనం చేసుకుంది. చీరలలో నోట్లు కూడా దాచిపెట్టారని ఎసిబి వర్గాలు తెలిపాయి.
విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో బెంగుళూరు, కలబురగి, దావణగెరె, బెళగావి, మంగళూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధికారులు దాడులు చేస్తున్నారు. ఎనిమిది మంది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, 100 మంది అధికారులు, 300 మంది సిబ్బందితో సహా 400 మందికి పైగా అధికారులు ఈ దాడులు నిర్వహిస్తూ ఉన్నారు.