ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో ఆందోళనలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఆందోళనకారులు ఇప్పటికే శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంట్లోకి దూసుకెళ్లారు. వారికి ఆ ఇంట్లో కోట్లాది రూపాయల డబ్బు కనపడింది. దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిన వేళ ఆయన ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు కనపడింది. ఆందోళనకారులు కోట్లాది రూపాయల డబ్బును గుర్తించి దాన్ని భద్రతా సిబ్బందికి అందించారు. కొందరు డబ్బును లెక్కపెడుతున్నట్లు ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దేశంలో శాంతియుత వాతావరణం కోసం ప్రజలు సహకరించాలని ఆ దేశ ఆర్మీ చీఫ్ కోరారు. ప్రధాని రణిల్ విక్రమ సింఘే ప్రైవేటు వాహనానికి సైతం ఆందోళనకారులు నిప్పు పెట్టారు. రక్షణ దళాల చీఫ్ జనరల్ శవేంద్ర శిల్ప మాట్లాడుతూ.. శాంతియుత మార్గంలో సంక్షోభ పరిష్కారానికి అవకాశం లభించినట్టు చెప్పారు. దేశంలో శాంతి స్థాపనకు వీలుగా సాయుధ దళాలు, పోలీసులకు సహకారం అందించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
మొదట దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాసాన్ని ముట్టడించిన ఆందోళనకారులు, ఆ తర్వాత ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రైవేటు నివాసానికి నిప్పంటించారు. గేట్లు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించిన నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. ప్రధానికి చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. ప్రధాని రణిల్ విక్రమసింఘే పదవికి రాజీనామా చేస్తానని, అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతుందని ప్రకటన చేశారు.