ఊహించని ట్విస్ట్.. ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు

0
636

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో విచారణకు హాజరుకావాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ సిట్ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 29న బంజారాహిల్స్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. ఈ కేసు విచారణలో రఘురాజుకు సంబంధించి కీలక విషయాలను సిట్ సేకరించి.. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ లను సిట్ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపింది. ఆ తర్వాత బీజేపీ నేత బీఎస్ సంతోష్, భారతీయ ధర్మ జనసేన చీఫ్ తుషార్, కేరళ వైద్యుడు జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్ లకు నోటీసులు జారీ చేసింది. నందకుమార్ భార్య చిత్రలేఖ, న్యాయవాది ప్రతాప్ కుమార్ లకు నోటీసులు ఇవ్వగా.. ఇప్పుడు రఘురాజుకు నోటీసులు జారీ చేసింది.

మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ పై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. సంతోష్ తో పాటు తుషార్, జగ్గుస్వామిలపై కూడా కేసులు నమోదు చేశారు. సంతోష్ కు మరోసారి నోటీసులు జారీ చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 41ఏ సీఆర్పీసీ కింద ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చారు. తమ విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు రెండు తేదీలను నోటీసుల్లో సూచించారు. ఈ నెల 26న లేదా 28న విచారణకు రావాల్సిందిగా కోరారు.