ట్విట్టర్ సంస్థ పలువురు భారత ప్రముఖుల ఖాతాలకు బ్లూ టిక్ (వెరిఫికేషన్ మార్క్) ను తొలగించడం అత్యంత వివాదాస్పదమైంది. బ్లూ మార్క్ ను తొలగించడానికి కారణం ఖాతాలను ఎక్కువ రోజులు వాడకపోవడమేనని ట్విట్టర్ చెబుతోంది. ఆరు నెలల కన్నా ఎక్కువ కాలం పాటు వాడని ఖాతాలు ఎన్నో ఉన్నాయని.. వారి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ ను తొలగించి కొత్త వివాదానికి దారి తీసింది ట్విట్టర్. ఆ తర్వాత కొద్దిసేపటికే బ్లూ టిక్ ను పునరుద్ధరించింది. ఆరెస్సెస్ అధిపతి మోహన్ భగవత్ ఖాతాకు కూడా బ్లూ టిక్ ను తీసేసింది. ఆయనతో పాటు మరో నలుగురు ఆరెస్సెస్ ప్రముఖుల ఖాతాల్లోనూ టిక్ మార్క్ ను తొలగించింది. ఆరెస్సెస్ జాయింట్ జనరల్ సెక్రటరీలు కృష్ణగోపాల్, అరుణ్ కుమార్, జనరల్ సెక్రటరీ సురేశ్ భయ్యాజీ జోషి, సంపర్క్ ప్రముఖ్ అనిరుధ్ దేశ్ పాండేల ట్విట్టర్ ఖాతాకు బ్లూ మార్క్ ను తొలగించింది. భారత ప్రముఖుల అకౌంట్లకు బ్లూ టిక్ తొలగిస్తూ ఉండడంతో ట్విట్టర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా మోహన్ భగవత్ ట్విట్టర్ ఖాతాకు కూడా బ్లూ టిక్ ను పునరుద్ధరించింది. ఆయనతో పాటు కృష్ణగోపాల్ తదితర ఆర్ఎస్ఎస్ ప్రముఖుల ఖాతాల బ్లూ టిక్ లను పునరుద్ధరించింది.

మరోవైపు భారత ప్రభుత్వం ట్విట్టర్ కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. కొత్త ఐటీ చట్టం నిబంధనల ప్రకారం భారతీయుడిని గ్రీవెన్స్ అధికారిగా నియమిస్తారా? లేదా? అని హెచ్చరించింది. భారత ఐటీ మినిస్ట్రీ నిబంధనలకు తగ్గట్టు ట్విట్టర్ నడుచుకోవాలని, లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇదే చివరి నోటీసని కూడా హెచ్చరించింది.
