Sports

ఓ వైపు అజారుద్దీన్ పై వేటు.. క్రికెటర్ల జీవితాలతో హెచ్‌సీఏ ఆటలు

హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ కు అపెక్స్ కౌన్సిల్ ఊహించని షాక్ ఇచ్చింది. హెచ్ సీఏ అధ్యక్షుడిగా మహ్మద్ అజారుద్దీన్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ బుధవారం నాడు తొలగించింది. ఈ నిర్ణయం ‘ఏకగ్రీవంగా’ ఉందని సుప్రీం కౌన్సిల్ తెలిపింది. మహ్మద్ అజారుద్దీన్ పై అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయన్న కారణంతో అపెక్స్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్ సీఏలో మహ్మద్ అజారుద్దీన్ సభ్యత్వాన్ని కూడా కౌన్సిల్ రద్దు చేసింది. 2019 సెప్టెంబర్ 27 న హెచ్ సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్‌కు షో-కాజ్ నోటీసు జారీ చేసింది.

“మీపై (అజారుద్దీన్) సభ్యులు చేసిన ఫిర్యాదులను పరిశీలించిన తరువాత, మీరు నిబంధనలను ఉల్లంఘించినట్లు వ్యవహరించిన కారణంతో షో-కాజ్ నోటీసు జారీ చేయడానికి ఈ నెల 10 న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. అపెక్స్ కౌన్సిల్ మిమ్మల్ని సస్పెండ్ చేస్తోంది. ఈ ఫిర్యాదులపై విచారణ పూర్తయ్యే వరకు మీ హెచ్ సీఏ సభ్యత్వం రద్దు చేయబడుతోంది “అని షోకేస్ నోటీసుల్లో ఉంది. అజారుద్దీన్ హెచ్ సీఏ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, ప్యానల్‌ను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నాడని సభ్యులు ఆరోపిస్తూ వస్తున్నారు. అజారుద్దీన్ 2019 సెప్టెంబర్ 27 న హెచ్ సీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, కానీ అప్పటి నుండి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

మహ్మద్ అజారుద్దీన్ హెచ్ సీఏ అధ్యక్ష పదవిలోకి వచ్చినప్పటి నుంచే విభేదాలు కొనసాగాయి. ఏప్రిల్ లో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో కూడా అజర్, హెచ్ సీఏ కార్యదర్శి విజయానంద్ స్టేజిపైనే గొడవపడ్డారు. సర్వసభ్య సమావేశంలో 130 మంది క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అంబుడ్స్ మెన్ గా జస్టిస్ దీపక్ వర్మను నియమించారు. ఈ నియామకం విషయంలో అజారుద్దీన్, విజయానంద్ మధ్య స్టేజీపైనే ఘర్షణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నందుకే వేటు వేసినట్టు అపెక్స్ కౌన్సిల్ వెల్లడించింది. హెచ్‌సీఏలో వివాదాలు చాలా కాలం నుంచి ఉన్నాయి. వీటిని పరిష్కరించి, సంస్థను ప్రక్షాళన చేయడం కోసం కోసం గతంలో ఎన్నో కమిటీలు వేసినా ఇప్పటి వరకూ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఒక వర్గంగా.. మాజీ క్రికెటర్లు అర్షద్ ఆయూబ్, శివలాల్ యాదవ్ మరో వర్గంగా ఉన్నారు. హెచ్‌సీఏలో అజారుద్దీన్ నాయకత్వంపై గతంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. టాలెంట్ ఉన్న ఆటగాళ్లను అజార్ ప్రోత్సహించడంలేదని.. ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల సెలక్షన్స్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు గుప్పించారు. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ జట్టు ఎంత దారుణంగా ఆడుతోంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ నోటీసులపై అజారుద్దీన్ స్పందించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనకు హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసిందని.. అవినీతిని అరికట్టడానికి అంబుడ్స్ మెన్ నియమిస్తే అడ్డుకొన్నారని అజర్ ఆరోపించారు. వాళ్ల అవినీతి బయటపడుతోందనే ఉద్దేశ్యంతోనే తనపై కుట్రలు పన్నారని.. హెచ్‌సీఏ గౌరవానికి ఏనాడూ భంగం కల్గించేలా చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. ఓ లెటర్‌ను విడుదల చేశాడు. ఉద్దేశపూర్వకంగా అపెక్స్ కౌన్సిల్ సభ్యులు నాకు నోటీసులు జారీచేశారని పేర్కొన్నారు. అలాగే తానెప్పుడూ హెచ్‌సీఏ గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించలేదని, వ్యతిరేకంగా పనిచేయలేదని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్‌ లో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారని, కేవలం అయిదుగురు సభ్యులు (జాన్ మనోజ్, విజయనంద్, నరేష్ శర్మ, సురేందర్ అగర్వాల్, అనురాధ) ఓ వర్గంగా ఏర్పడి ఇదంతా చేస్తున్నారని.. వారు చేసిందే అపెక్స్‌ కౌన్సిల్ నిర్ణయంగా భావిస్తే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. హెచ్‌సీఏ లో జరుగుతున్న.. అలాగే ఇదివరకు జరిగిన అవినీతిని అరికట్టేందుకు సమర్థవంతమైన ఓ వ్యక్తిని అంబుడ్స్‌మెన్‌గా నియమిస్తే ఈ వర్గమే తప్పు పట్టిందని అన్నారు. వాళ్ల తప్పులు ఎక్కడ బయటపడతాయనే భయం వారిని వెంటాడుతూ ఉందని.. అందుకే తనను టార్గెట్ చేశారని అజారుద్దీన్ చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ లో ఉన్న రాజకీయాలు.. మరే చోట ఉండవని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది హైదరాబాద్ క్రికెట్ సంఘం. ఈ వివాదాలతో పాటూ క్రికెటర్ల భవిష్యత్తుతో కూడా ఎంతో మంది ఆడుకుంటూ ఉన్నారు. అందుకే టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు నిరాశ ఎదురవుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

eighteen + 14 =

Back to top button