సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాళవిక సూద్ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీల సమక్షంలో ఇటీవల పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ సోనూసూద్ కరోనా కాలంలో మానవత్వం చాటుతూ అద్వితీయమైన పని చేశారని అన్నారు. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు మాతో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. తన సోదరి మాళవికా సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరడం గురించి సోనూ సూద్ తన సోషల్ మీడియా ఖాతాలలో తెలియజేశాడు. “నా సోదరి మాళవిక సూద్ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించినందున, నేను ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆమె జీవితంలోని ఈ కొత్త అధ్యాయం కోసం వేచి చూస్తున్నాను. మాళవికకు శుభాకాంక్షలు” అని సోనూ సూద్ కూడా తెలిపాడు.
ఇదంతా ఓకె కానీ.. సోనూ సూద్ చెల్లెలి రాకతో ఓ వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇచ్చింది. యూత్ కాంగ్రెస్ వర్కర్‌గా ప్రారంభించి.. 21 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పని చేసిన వ్యక్తికి కాకుండా సోనూ సూద్ సోదరికి టికెట్ ఇవ్వడాన్ని పలువురు విమర్శిస్తూ ఉన్నారు. మోగా నుండి సోనూ సూద్ సోదరి మాళవిక పోటీకి దిగనుండడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్జోత్ కమల్ తన వ్యతిరేక గళాన్ని వినిపించారు. దీంతో ఆయన బీజేపీలోకి చేరారు. పంజాబ్‌లోని మోగా నుండి చంఢీగడ్‌లోని బీజేపీ ఆఫీస్‌కు చేరుకున్నారు కమల్. మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో తనని ఆ స్థానం నుండి తప్పించాలని అనుకున్నారని.. ఎన్నికల టికెట్ ఇవ్వకపోవడం నన్ను అవమానించడమేనని అన్నారు. రాష్ట్రంలో మరో స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ అధీష్టానం తనను కోరిందని.. దీంతో తనను అవమానించినట్టు భావించి తిరస్కరించానని అన్నారు. మోగాకు ఇటీవల సిద్ధూ వచ్చినప్పుడు మా ఇంటికి రాకుండా, నేరుగా మాళవికా సూద్ ఇంటికి వెళ్లాడన్నారు. కాంగ్రెస్ మాళవిక సూద్‌ను ఎంపిక చేసుకోవడం పట్ల నాకెటువంటి అభ్యంతరం లేదు. మోగా నుంచి నాకు సీటు ఇవ్వకపోవడమే బాధగా ఉందని అన్నారు. మాళవిక నాకు సోదరి లాంటిదని.. ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండానే కేవలం సోనూ సూద్ సోదరి అయిన కారణంగా సీటు ఇచ్చారని విమర్శించారు.
