అతి విశ్వాసం వద్దంటూ ముఖ్యమంత్రులను ఎప్పుడో హెచ్చరించిన మోదీ..!

0
800

భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తూ ఉంది. కేంద్రప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్న ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. అయితే కొన్ని వారాల కిందట.. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి లేని సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షలు నిర్వహించగా కొందరు ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల్లో పొలిటికల్ ర్యాలీల్లో పాల్గొనడానికి సమయాన్ని కేటాయించారట..!

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యిందంటూ పలువురు నేతలు విమర్శిస్తూ ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ సదరు నేతలకు సరైన సమాధానం చెప్పడానికి సిద్ధమైంది. కరోనా విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ముఖ్యమంత్రులకు చెప్పారు. వారిలో కొందరు కనీసం మోదీ సూచనలను పాటించలేదు సరి కదా.. ఇంకొందరైతే ఆయా రాష్ట్రాల్లో తమ పార్టీలను గెలిపించుకోడానికి ర్యాలీలల్లో పాల్గొన్నారు.
మార్చి 17న నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో భేటీ నిర్వహించారు. అప్పటికే కరోనా కేసుల పెరుగుదల కాస్త ఎక్కువగా ఉండడంతో వెంటనే కరోనా కట్టడికి సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘కోవిడ్ మీద తీసుకుంటున్న చర్యలు ప్రస్తుతానికైతే సంతృప్తికరంగా ఉన్నాయి. అతి విశ్వాసం పనికి రాదు’ అని ముఖ్యమంత్రుల సమావేశంలో చెప్పారు. మైక్రో కంటోన్మెంట్ జోన్ లను ఏర్పాటు చేసి కరోనా కేసులను కట్టడి చేయాలని కోరారు. గతేడాది సెప్టెంబర్ 23 నుండి ఈ ఏడాది ఏప్రిల్ 23 వరకూ మొత్తం ఆరు సార్లు సమావేశాలను నిర్వహించారు. ఈ ఆరు సమావేశాల్లో కూడా కరోనా కేసులు అధికంగా ఉన్న 60 జిల్లాలపై శ్రద్ధ చూపాలని ముఖ్యమంత్రులను నరేంద్ర మోదీ కోరుతూనే ఉన్నారు. మోదీ మార్చి 17న ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించిన సమయానికి దేశంలో రోజూ 30000 కేసులు మాత్రమే నమోదవుతూ ఉండేవని భారతీయ జనతా పార్టీ చెప్పుకొచ్చింది.

మోదీ ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహించిన సమయంలో కొందరు ముఖ్యమంత్రులు హాజరు కూడా అవ్వలేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఛత్తీస్ ఘర్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ లు మోదీతో వర్చువల్ సమావేశాలను డుమ్మా కొట్టారు. ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై సదరు ముఖ్యమంత్రులు దృష్టి పెట్టారు. భూపేష్ భగేల్ సొంత రాష్ట్రాన్ని వదిలి మరీ అస్సాం ఎలెక్షన్స్ లో కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం చేశారు.

కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్న మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను మోదీ ప్రభుత్వం పంపించింది. మార్చి నెల వరకూ కేరళ, మహారాష్ట్రల లోనే అత్యధికంగా కరోనా కేసులు వస్తూ ఉండేవి. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 75 శాతం ఆ రాష్ట్రాలలోనే నమోదయ్యాయి.

మరో వైపు కాంగ్రెస్ పార్టీ నేతలు కరోనా వ్యాక్సిన్లపై కూడా తప్పుడు ప్రచారాన్ని చేసిందంటూ భారతీయ జనతా పార్టీ ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చెందిన హెల్త్ మినిస్టర్లు వ్యాక్సిన్లపై అనవసరపు అనుమానాలను వ్యక్తం చేశారని బీజేపీ విమర్శించింది. శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి వ్యాక్సిన్లను తీసుకుని వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వ్యాక్సిన్లపై ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారని బీజేపీ నేతలు విమర్శించారు. మోదీ సెకండ్ వేవ్ గురించి హెచ్చరించినప్పుడు కనీసం పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు మోదీ విఫలమయ్యారంటూ కామెంట్లు చేస్తూ ఉండడం హాస్యాస్పదమని బీజేపీ గట్టి కౌంటర్ వేస్తోంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here