More

  ఏడేళ్లలో ఏం సాధించారు..?
  మోదీ పాలనపై ఓ చిన్న విశ్లేషణ

  నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా ఏడేళ్లు పూర్తిచేసుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాని పగ్గాలు చేపట్టిన మోదీ.. 2019లోనూ అఖండ మెజారిటీతో వరుసగా రెండోసారి ప్రధాని అయ్యారు. ఈ ఏడేళ్ళ కాలంలో ఒక విధంగా మోదీ పాలన చరిత్ర సృష్టించింది. నోట్ల రద్దు, జీఎస్టీ, పాక్ ఆక్రమిత ప్రాంతంలోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు, జమ్మూ కాశ్మీర్ ను ప్రధాన స్రవంతిలో కలపడం, మొదటిసారి ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను ఇనుమడింప చేయడం వంటి పలు అసాధ్యాలను సాధ్యం చేశారు. తొలి ఐదేళ్ల కాలంలో ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ నుంచి గ్రామాల విద్యుద్దీకరణ, బేటీ పడావో బేటీ బచావో ప్రోగ్రాం, జన్‌థన్ యోచన నుంచి చారిత్రక అయోధ్య తీర్పు, రెండో దఫా ఐదేళ్ల పాలన ప్రారంభంలో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

  2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 544 స్థానాలకు గాను 282 స్థానాలు గెలుచుకుని సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఇది 15వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన దాని కంటే 166 సీట్లు ఎక్కువ. 2014 మే 26న మోదీ ప్రమాణస్వీకారం చేశారు. 2019లోనూ బీజేపీ 303 సీట్లతో భారీ విజయం దక్కించుకుంది. ఒక కాంగ్రెసేతర ప్రభుత్వం కేంద్రంలో ఇలా వరుసగా రెండోసారి గెలుపొందడం ఇదే తొలిసారి.

  క‌రోనా వైర‌స్ ఉద్ధృతి కార‌ణంగా ఈ ఏడేళ్లలో తొలిసారిగా మోదీ కాస్తా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. గత ఏడు సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం అనేక కఠిన నిర్ణయాలతో చరిత్ర సృనిర్ణయాలు తీసుకుంది. వీటిలో అన్నింటికంటే ముందుగా చెప్పుకోవాల్సిన అంశం పెద్దనోట్ల రద్దు. 2016 న‌వంబ‌ర్ 8.. రాత్రి టీవీ లైవ్ లోకి వచ్చిన ప్ర‌ధాని మోదీ.. పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 500, 1000 రూపాయల నోట్లు పనికిరానివని చెప్పారు. వాటిని బ్యాంకుల్లో జమ చేయడానికి అనుమతించారు. డీమోనిటైజేషన్ తర్వాత 21 నెలలకు రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం, డీమోనిటైజేషన్ సమయంలో రిజర్వ్ బ్యాంకులో జమ చేసిన మొత్తం 500, 1000 నోట్ల విలువ రూ.15.31 లక్షల కోట్లు. అంటే, 99.3 శాతం డబ్బు రిజర్వ్ బ్యాంకుకు తిరిగి వ‌చ్చింది. ఈ నిర్ణయంతో దేశంలో డిజిటల్ మనీ వేగం పుంజుకుంది. ఆన్ లైన్ చెల్లింపులతో పారదర్శకత పెరిగి.. అవినీతికి అడ్డుకట్ట పడింది.

  ఈ ఏడేళ్లలో రక్షణ రంగం ఊహించినిరీతిలో బలోపేతమైంది. 2016 డిసెంబ‌ర్ 28.. అర్ధ‌రాత్రి పాకిస్తాన్ భూభాగంలో ఉన్న బాలాకోట్ పై భార‌త ఆర్మీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేప‌ట్టింది. పెద్ద సంఖ్య‌లో ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చింది. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైషె మహ్మద్ ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం ఈ సర్జికల్ స్ట్రైక్స్ చేప‌ట్టింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన త‌ర్వాత శ‌త్రుదేశంలోకి ప్ర‌వేశించి మ‌రీ వైమానిక‌దాడులు చేయ‌డం ఇదే తొలిసారి. వైమానిక దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత‌ పాకిస్తాన్ విమానం నియంత్రణ రేఖను దాటి భారత సరిహద్దులోకి ప్రవేశించి బాంబు దాడి చేసింది. పాక్ విమానాన్ని వెంటాడుతూ వెళ్లిన‌ మన మిగ్ -21 పాకిస్తాన్ సరిహద్దులో పడింది. పాక్ విమానాన్ని వీరోచితంగా కూల్చేసిన మన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ దురద్రుష్టవశాత్తు పాక్ దళాలకు చిక్కారు. అయితే, మోదీ అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ పై ఒత్తిడి తీసుకురావడంతో అభినందన్ ను పాక్ ప్రభుత్వం బేషరతుగా విడిచిపెట్టింది.

  ఇక, పెద్ద నోట్ల రద్దుతో అవినీతికి చెక్ పెట్టిన మోదీ.. వన్ నేషన్, వన్ ట్యాక్స్ పేరుతో ఒకే విధమైన పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చారు. 2017 జూలై 1న జీఎస్టీని కేంద్ర ప్ర‌భుత్వం అమలు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అప్పటివరకు రకరకాలుగా వున్న పన్నులన్నింటినీ ఒకే పన్నులో విలీనం చేసింది. 122వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జీఎస్టీ బిల్లును తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వం. కొత్త జీఎస్టీ విధానంతో పన్ను విధింపులోనూ పారదర్శకత ఏర్పటింది. వినియోగదారులతో పాటు చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఈ పన్ను విధానం ఊరటనిచ్చింది. ఇప్పుడు దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒకే విధమైన పన్ను విధించబడుతోంది. తొలుత‌ కొన్ని సమస్యలను ఎదుర్కొన్న‌ప్ప‌టికీ క్రమంగా పరిస్థితి మెరుగుపడింది. అనేక మార్పుల త‌ర్వాత‌ ఈ ప్రక్రియ ఇప్పుడు మరింత పారదర్శకంగా త‌యారైంది.

  అటు, దశాబ్దాలుగా అపరికష్క్రుతంగా వున్న అంశాలను కూడా మోదీ చక్కబెట్టారు. 2018 డిసెంబ‌ర్ 19న ట్రిపుల్ తలాక్ విధానానికి స్వస్తి చెప్పి ముస్లిం మహిళల హక్కులను కాపాడారు. ముస్లిం వివాహ హక్కుల సంరక్షణ బిల్లు 2019 నిబంధనల ప్రకారం ముస్లిం మహిళకు ఒకేసారి ట్రిపుల్ తలాక్ చెప్పడం శిక్షార్హమైన నేరం. ఈ చ‌ట్టం ప్ర‌కారం ట్రిపుల్ త‌లాక్ చెప్పిన‌ వారికి మూడేళ్లు జైలు శిక్ష విధించే అవ‌కాశ‌ం వుంది. దీంతోపాటు ముస్లిం మహిళలకు భరణం కూడా ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం ఈ కేసుల సంఖ్య 5-10 శాతానికి ప‌డిపోయాయి.

  ఇక, మోదీ రెండో టర్మ్ లో తీసుకున్న అత్యంత చరిత్రాత్మకమైన నిర్ణయం ఆర్టికల్ 370 రద్దు. దీంతో జమ్ముకశ్మీర్‌లో భారతరాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. కశ్మీర్‌పై కేంద్రానికి పూర్తి అధికారాలు లభించాయి. అయితే, కశ్మీర్ ను దశాబ్దాలుగా తమ చెప్పుచేతల్లో పెట్టుకున్న కొన్ని వారసత్వ రాజకీయ పార్టీలకు ఆర్టికల్ 370 రద్దు నచ్చలేదు. దీంతో ప‌లువురు నాయకులను గృహ నిర్బంధంలో ఉంచాల్సివచ్చింది. ఇంటర్నెట్‌తో సహా కమ్యూనికేషన్ సదుపాయాలను నిలిపివేయాల్సి వచ్చింది. దీని తర్వాత ఆర్టికల్ 35ఏ రద్దు అంశం కూడా కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టింది. జమ్ముక‌శ్మీర్ రాష్ట్ర విభజన బిల్లులను కూడా అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్ట‌గా ఆమోదం పొందింది. జ‌మ్ము క‌శ్మీర్‌ను రెండు భాగాలుగా.. జమ్ము- కశ్మీర్, లద్దాక్ ప్రాంతాలుగా విభజించారు. వీటిలో జమ్ముకశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లద్దాక్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు.

  మోదీ హయాంలో తీసుకున్న మరో కఠిన నిర్ణయం సీఏఏ రద్దు. 2020 జ‌న‌వ‌రి 10.. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమ‌లులోకి తీసుకొచ్చారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వ‌డం ఈ చ‌ట్టం ముఖ్యోద్దేశం. ఇంతకుముందు ఈ ప్రజలు భారతదేశ పౌరసత్వం పొందడానికి 11 సంవత్సరాలు భారతదేశంలో నివసించాల్సి వచ్చింది. పౌరసత్వ సవరణ బిల్లు తర్వాత ఈ కాలాన్ని 11 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు తగ్గించారు. అంతేకాదు, అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64 సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టానికి ఈ పౌరసత్వ సవరణ బిల్లు చెక్ పెట్టింది. పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులు, అనుమతించిన కాల పరిమితిని దాటి దేశంలోనే వుంటే.. వారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తారు. చ‌ట్టంతో చాలా ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్నవారు భారత పౌరసత్వం పొందడం సులభమైంది.

  మోదీ తీసుకున్న మరో చరిత్రాత్మక నిర్ణయం బ్యాంకుల విలీనం. ప‌ది ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను విలీనం చేసి నాలుగు బ్యాంకులుగా రూపొందించే నిర్ణ‌యానికి కేంద్రం పచ్చ‌జెండా ఊపింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం అయ్యాయి. సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్‌ను ఇండియన్ బ్యాంకులో విలీనం చేశారు. ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అనుసంధానం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఐడిబిఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు లభించ‌డం మొద‌లైంది. బ్యాంకుల ఖర్చు తగ్గింది. బ్యాంకుల ఉత్పాదకత పెరిగింది. టెక్నాలజీలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం వచ్చింది. దీంతో ప్రైవేటు బ్యాంకులతో మెరుగ్గా పోటీ పడటానికి ప్రయత్నిస్తున్నారు.

  వీటితోపాటు మరికొన్ని కఠినమైన, చరిత్రాత్మకమై ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు మోదీ. దశాబ్దాలుగా రగులుతున్న అయోధ్య సమస్యకు మోదీ హయాంలోనే పరిష్కారం లభించింది. మున్ముందు మరిని నిర్ణయాలతో పాలనను మరింత పారదర్శకంగా మార్చనున్నారు. ఎన్నికల సంస్కరణలో భాగంగా వన్ నేషన్, వన్ ఎలక్షన్ విధానానికి కూడా మోదీ శ్రీకారం చుట్టబోతున్నారు. తద్వారా మాటిమాటికి ఎన్నికల పేరుతో జరిగే డబ్బు, సమయం వృథానున అరికట్టనున్ననారు. ఇక, మేకిన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా అంటూ దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయిస్తున్నారు. నూతన రైతు చట్టాలతో వ్యవసాయ రంగాన్ని కూడా సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారు. అయితే, రైతులను బానిసలుగా చూసే కొన్ని రాజకీయ శక్తులు.. ఈ కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్నాయి. గత ఆర్నెల్లుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను తప్పుదోవ పట్టిస్తూ ఉద్యమాన్ని చేపట్టాయి. దీనికి, దేశ విద్రోహ శక్తులైన ఖలిస్తాన్ వంటి ఉగ్రవాద సంస్థలు, విదేశీ శక్తులు మద్దతు పలుకుతుండటం.. పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చింది.

  అయితే, ఎన్ని అవాంతరాలెదురైనా అనుకున్న లక్ష్యం వైపు అలుపెరుగకుండా ముందుకు సాగుతున్నారు ప్రధాని మోదీ. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలోనూ మోదీ ప్రభుత్వం ఎక్కడా అలసత్వం ప్రదర్శించకుండా ముందుకు సాగుతోంది. అయితే, మొదటి దశ కరోనా ఉధృతి పకడ్బందీగా అరికట్టి.. ప్రపంచ దేశాల ప్రశంసలు పొందింది మోదీ సర్కార్. అయితే, రెండో దశ విజృంభణను సరిగ్గా అంచనా వేయపోవడం, రాష్ట్రాలను ముందుగా హెచ్చరించినా పట్టించుకోకపోవడం, విదేశీ శక్తుల హస్తం.. ఇలా కారణమేదైనా.. నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయినా, హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమృద్ధిగా వున్న అమెరికాతో పోల్చితే.. సెకండ్ వేవ్ కట్టడిలోనూ సఫలమైనట్టే. అయితే, ల్యూటియెన్స్ మీడియా శక్తులు కరోనా విషయంలో శ్మశాన జర్నలిజాన్ని ప్రదర్శిస్తున్నాయి. విదేశీ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన విపక్ష పార్టీలు విషం కక్కుతున్నాయి. అయినా, అన్నింటినీ ఓర్పుగా భరిస్తూ.. కరోనా కష్టకాలంలో ఆత్మనిర్భరంగా ముందుకు సాగుతున్నారు.

  ఈ దేశంలో మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక నేత నరేంద్ర మోదీయే. కొందరికి అతిశయోక్తిలా అనిపించినా.. ఇది కాదనలేని వాస్తవం. అవినీతి రహిత పారదర్శక పాలన అందిస్తున్నందు వల్లే ప్రజలు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఆయనకు సమవుజ్జీ కాగలిగిన నేత ప్రతిపక్షాల్లో ఇప్పుడే కాదు, సమీప భవిష్యత్ లోనూ ఉద్భవించే అవకాశాలు లేవన్న సత్యం వారికి బాగా తెలుసు. అందుకే, అయినదానికి కానిదానికి రాద్దాంతం చేస్తూ.. ప్రతి అంశంపైనా విషం కక్కుతూ కాలం గడుపుతున్నారు.

  Trending Stories

  Related Stories