జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా రాజకీయ నాయకులు.. ఇతర రంగాలకు చెందిన ప్రముఖులందరూ వైద్యుల సేవలను కొనియాడుతున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా మహమ్మారి పై పోరాటం సాగిస్తున్న వైద్యులపై ప్రశంసల జల్లు కురుస్తూ ఉంది. కరోనా మహమ్మారి దేశంలో ప్రబలినప్పటి నుండి నిరంతరాయంగా సేవలందిస్తున్న వైద్యులకు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని పలువురు ప్రముఖులు వైద్యుల సేవలను కొనియాడారు.
ఈ కష్టకాలంలో వైద్యులు చేసిన సేవలు అమోఘమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ‘వైద్యుల దినోత్సవం రోజున, వైద్యులందరికీ నా శుభాకాంక్షలు.. ఔషధ రంగంలో, వైద్యంలో ప్రపంచంలో భారతదేశం సాధించిన పురోగతులు ప్రశంసనీయం , ప్రజలంతా ఆరోగ్యంగా ఉండటానికి అవి ఎంతగానో దోహదపడ్డాయి’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తూ ఎంతో మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాను ఎదుర్కొనే క్రమంలో వైద్యులు ముందు వరుసలో ఉన్నారని.. ప్రాణాలను సైతం పణంగా పెట్టి రోగులకు సేవ చేశారని ప్రశంసించారు. వైద్య రంగం కోసం రూ. 2 లక్షల కోట్ల నిధులను కేటాయిస్తున్నట్టు చెప్పారు. కరోనా సమయంలో లక్షలాది మందికి సేవలు అందించడానికి డిజిటల్ ఇండియా పథకం దోహదపడిందని మోదీ అన్నారు. ఈ పథకంలో భాగంగా అనేక పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. కో-విన్ ఫ్టాట్ ఫామ్ ను అనుసరించేందుకు అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. గ్లోబల్ సెక్యూరిటీపై ఐక్యరాజ్యసమితి ఇచ్చిన ర్యాంకింగ్స్ లో మన దేశానికి పదో ర్యాంక్ వచ్చిందని.. భారత్ లో డేటా ప్రైవసీ కూడా పెరిగిందని చెప్పారు. వైద్య ప్రపంచంలో భారతదేశం సాధించిన ప్రగతి ప్రశంసనీయం అని అన్నారు. గత వారాంతంలో తన మన్ కి బాత్ రేడియో ప్రసంగంలోని ఒక క్లిప్పింగ్ ని షేర్ చేస్తూ దేశంలో కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవడంలో ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తల కృషిని ఆయన ప్రశంసించారు.
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వైద్యుల సేవ విధి పిలుపుకు మించిందని.. విధిని సైతం ధిక్కరిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడటంలో తమ ప్రాణాలను పణంగా పెట్టిన నిస్వార్థ దేవదూతలకు మనం ఎంతో రుణపడి ఉన్నామని ఆయన అన్నారు.
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. వైద్యులను భగవంతుడితో సమానంగా గౌరవించమని భారతీయ సంస్కృతి చెబుతోందని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిరంతరాయంగా నిస్వార్థ సేవలు అందిస్తున్న వైద్యులందరికీ ఈ సందర్భంగా ప్రణామాలు అర్పిస్తున్నానని అన్నారు. కరోనా మహమ్మారి వైద్యులు, వారి కుటుంబ సభ్యుల మీద తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చిందని, అయినా వారు చిత్తశుద్ధితో తమ కర్తవ్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని ప్రశంసించారు.