
తౌక్త తుపాను ప్రభావిత ప్రాంతాలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రయత్నించనున్నారు. పశ్చిమ తీరంలోని రాష్ట్రాలను తౌక్త తుపాను అతలాకుతలం చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలని నరేంద్ర మోదీ నిర్ణయించారు. గుజరాత్, డయ్యూ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తుపాను విధ్వంసం మిగిల్చిన నష్టాన్ని పరిశీలించనున్నారు. తౌతే తుపాను గుజరాత్ వద్ద తీరం దాటిన నేపథ్యంలో భారీ నష్టం వాటిల్లింది.భావ్ నగర్, ఉనా, డయ్యూ, జాఫరాబాద్, మహువా ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా వీక్షించనున్నారు. అహ్మదాబాద్ లో తుపాను పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారు. గిర్-సోమనాథ్, అమ్రేలి జిల్లాలు, డయ్యూ ప్రాంతాలను మోదీ పరిశీలించనున్నారు. ఏరియల్ సర్వే పూర్తీ అయ్యిన తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతోనూ, ఉన్నతాధికారులతోనూ అహ్మదాబాద్ లో రివ్యూ మీటింగ్ ను నిర్వహించనున్నారు. సాయంత్రం తిరిగి న్యూ ఢిల్లీ చేరుకోనున్నారు.
తౌక్త తుపాను కేరళ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపించింది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసింది. ముంబై మహా నగరం కూడా తడిసి ముద్దయింది. తుపాను ధాటికి గుజరాత్ లో ఏడుగురు మరణించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రోడ్లు, నివాస గృహాలు దెబ్బతిన్నాయి. 16 వేళ్ల ఇళ్లకుపైగా దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ, కోస్ట్ గార్డ్ దళాల సహాయక చర్యలతో చాలావరకు ప్రాణనష్టం తగ్గింది. తుపాను గురించి భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసినప్పటి నుండి ప్రధాని మోదీ పశ్చిమాన ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. నష్టపోయిన ప్రాంతాలకు అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చారు. నేడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అందించాల్సిన సాయంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.