పేరులోనే మేఘాన్ని దాచుకున్న మేఘాలయ.. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఈ రాష్ట్రంలో మేఘాలు.. ఏదో చోట నిత్యం వర్షిస్తూనేవుంటాయి. అందుకే రాష్ట్రం మొత్తం చెట్లతో, పచ్చదనంతో నిత్యనూతనంగా కళకళలాడుతూవుంటుంది. ఆ రాష్ట్రంలో కలప విరివిగా లభిస్తుంది కాబట్టే.. అక్కడ కలపతో చేసిన నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. అక్కడ స్థానికులు చెట్ల తీగలతోనే చిన్న చిన్న వంతెనలు నిర్మించుకుంటారు. కాలక్రమేణా ఆ తీగల వంతెనలే మరింత బలోపేతమై పటిష్టమైన బ్రిడ్జీలుగా రూపాంతరం చెందుతాయి. ఇలాంటి వంతెనల్లో ఖాసీ తెగ నిర్మించిన ‘లివింగ్ రూట్’ వంతెన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. చెట్ల మూలాలతో రూపొందించబడిన పాదచార వంతెనలు.. మారుమూల ప్రాంతాల మధ్య ముఖ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి. కీకారణ్య ప్రాంతంలో గిరి పుత్రుల స్థిర మనుగడకు ఇవి ఎంతో దోహదపడతాయి. కలప, నీరు, ముడిపదార్థాలు మన్యం వాసులకు చేరడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థ ఇక్కడ వుంది.
ఉన్నట్టుండి ఈ మేఘాలయ వంతెనల ప్రస్తావన ఎందుకొచ్చిందని అనుకుంటున్నారా..? దీనికి కారణం వుంది. తాజాగా హిందూ మూలాలున్న వ్యక్తి రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నిక కావడంతో.. ఆయనకు మన ప్రధాని మోదీ ట్విట్టర్ లో అభినందనలు తెలియజేశారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన మీకు శుభాకాంక్షలు. అంతర్జాతీయ సమస్యలపై మనం కలిసి పనిచేద్దాం. 2030 దిశగా విజయవంతంగా అడుగులు వేద్దాం అని ట్వీట్ చేశారు. అంతేకాదు, Special Diwali wishes to the ‘living bridge’ of UK Indians, as we transform our historic ties into a modern partnership. అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అయితే, మోదీ ట్వీట్ లో వాడిన ‘లివింగ్ బ్రిడ్జ్’ అనే పదం ప్రాధాన్యత సంతరించుకుంది. అభినందన సందేశంలో మోదీ ప్రస్తావించిన లివింగ్ బ్రిడ్జ్ మేఘాలయలో ఖాసీ తెగలు చెట్లతో నిర్మించిన ప్రకృతి వంతెన.
మేఘాలయ లివింగ్ రూట్ బ్రిడ్జ్‌లు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా కోసం ప్రాథమిక జాబితాలో చేర్చబడ్డాయి. ఈ సజీవ రూట్ వంతెనలు మారుమూల అటవీ ప్రాంత ఖాసీ తెగల నైపుణ్యానికి ప్రతీక. ఈ వారధుల మొత్తం నిర్మాణం చెట్లు, చెట్ల కొమ్మలు, కాండములతో తయారవుతాయి. వెదురు ఫ్రేమ్ వర్క్, హ్యాండ్ రెయిల్, స్టెప్స్ సైతం ఈ నిర్మాణంలో వుంటాయి. కాలక్రమేణా వంతెనపై రాళ్లు, కలప పలకలు, ఆకులు మట్టి వేసి పటిష్టంగా మారుస్తారు. అయితే బ్రిడ్జి మూలాలు తగినంత బలంగా మారడానికి దాదాపు 15 నుంచి 30 ఏళ్లు పడుతుంది. ఫికస్ ఎలాస్టికా, అరెకా కాటేచూ చెట్లతో ఈ ట్రీ బ్రిడ్జిస్ తయారవుతాయి. తెగలు, కుటుంబాలు, జాతులుగా వీటిని గుర్తించాలనుకుంటే.. ఇవి తాటిచెట్ల జాతికిందకు వస్తాయని తెలుస్తోంది.
ఆధునిక సామగ్రి అందుబాటులోకి రాకమునుపే ఖాసీ కమ్యూనిటీ.. ఈ వంతెన ద్వారా గ్రామాల మధ్య కనెక్టవిటీని ఏర్పాటు చేసింది. పర్యాటకాన్ని మెరుగు పర్చింది. దాదాపు 35 మంది ఒకే సారి వంతెనను దాటకలిగే వీలుంటుంది. ఈ వంతెనల సగటు పరిధి 15 అడుగుల నుంచి 250 అడుగుల వరకు ఉంటుంది. ఈ వారథులు అనేక శతాబ్దాల పాటు కొనసాగుతాయి.
రిషి సునాక్ పాలనలో బ్రిటన్ – భారత్ బంధం మరింత దృఢంగా మారాలన్న ఉద్దేశంతో.. మేఘాలయలోని ‘లివింగ్ బ్రిడ్జ్’ ను ఉదహరించినట్టు తెలుస్తోంది. శతాబ్దాలుగా భారతీయులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు పర్యటనలు సాగిస్తున్నారని, ఎన్నో దేశాలలో అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారని అన్నారు. ఆయా దేశాల్లో ఎన్నో డెవలప్ మెంట్ సొసైటీలను సృష్టించి, ప్రగతికి దోహదం అవతున్నారని అన్నారు.