ఖుషీనగర్ ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

0
687

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖుషీనగర్ ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించారు. బుద్ధిజం పర్యాటకాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఖుషీనగర్ ఎయిర్ పోర్ట్ దోహదం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గౌతమబుద్ధుడి ‘మహాపరినిర్యాణం’ జరిగిన ఉత్తరప్రదేశ్ లోని ఖుషీనగర్ లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. ఆ ఎయిర్ పోర్ట్ ను నేడు ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎన్నో ఏళ్ల ఆశయాలు, ప్రయత్నాల ఫలితమే ఖుషీనగర్ విమానాశ్రయమని.. ఈ ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించాక తన ఆనందం రెండింతలైందని మోదీ చెప్పారు. పూర్వాంచల్ ప్రజల ఆశయాల సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఖుషీనగర్ ఎయిర్ పోర్ట్ కేవలం ఎయిర్ కనెక్టివిటీని పెంపొందించడమేగాకుండా.. వ్యాపారాలను సృష్టించి ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదం చేస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. బుద్ధుడితో అనుసంధానమైన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. బౌద్ధ భక్తులకు మెరుగైన వసతులను కల్పించడంతో పాటు ప్రయాణ అనుసంధానతనూ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఖుషీన‌గ‌ర్ అభివృద్ధి కేంద్ర‌, యూపీ ప్ర‌భుత్వ ఎజెండాలో ఉంద‌న్నారు. యూపీలో కొత్త‌గా 9 విమానాశ్ర‌యాల‌ను నిర్మిస్తున్నామ‌ని, జివార్ విమానాశ్ర‌యం దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ అవుతుంద‌ని ప్ర‌ధాని తెలిపారు

ఈ ప్రారంభోత్సవానికి దేశవిదేశాల నుంచి దౌత్య అధికారులు, బౌద్ధ భిక్షవులు వచ్చారు. శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, దక్షిణ కొరియా, నేపాల్, భూటాన్, కంబోడియాల నుంచి బౌద్ధ సన్యాసులు పెద్ద ఎత్తున ఖుషీ నగర్ కు చేరుకున్నారు. ఖుషీన‌గ‌ర్ కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న బౌద్ధ భ‌క్తులు వ‌స్తుంటారు. బౌద్ద ఆధ్యాత్మిక యాత్రికుల‌కు ఇదో చాలా ముఖ్య‌మైన యాత్రాస్థ‌లం. ఖుషీన‌గ‌ర్ విమానాశ్ర‌యం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా శ్రీలంక నుంచి తొలి విమానం ఇక్క‌డ ల్యాండ్ అయ్యింది. ఆ విమానంలో శ్రీలంక మంత్రులతో పాటు బౌద్ద మ‌త‌గురువులు వ‌చ్చారు. గౌతమ బుద్ధుడికి చెందిన వస్తువులను తీసుకుని వచ్చారు. గుజరాత్‌లోని వడనగర్‌ తవ్వకాల్లో లభించిన గౌతమ బుద్ధుడికి సంబంధించిన పురాతన వస్తువులనూ ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.