More

    భారతదేశ శక్తి ఏమిటో ప్రపంచానికి తెలిసింది: ప్రధాని మోదీ

    భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ మైలురాయిని చేరుకోవడం దేశ చరిత్రలో ఓ కొత్త అధ్యాయమ‌ని మోదీ అన్నారు. భార‌త్‌లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ద్వారా దేశ శ‌క్తి ఏంటో ప్ర‌పంచానికి చూపించామ‌ని.. క‌ఠిన‌మైన ల‌క్ష్యాలను దేశం విజయవంతంగా చేరుకోగ‌ల‌ద‌ని చెప్ప‌డానికి ఇదొక నిదర్శనమని అన్నారు. సబ్‌ కా సాత్‌ సబ్‌కా వికాస్‌ లక్ష్యంతో సత్ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు మోదీ. పేద, ధనిక తేడా లేకుండా అందరికీ వ్యాక్సిన్లు అందాయని.. అభివృద్ధి చెందిన దేశాల్లో టీకా తీసుకోవడానికి ప్రజలు ఇప్పటికీ ముందుకు రావట్లేదని అన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా టీకాలు అందించామ‌ని తెలిపారు. భారత్‌లో వ్యాక్సినేషన్ శాస్త్రీయ పద్ధతులపై ఆధారపడి కొన‌సాగింద‌ని చెప్పారు. కరోనా మహమ్మారి భారత్‌కు అతిపెద్ద సవాలే విసిరింది. ఇంత పెద్ద దేశానికి టీకాలు ఎలా సరఫరా అనేది సవాలే.. ఎన్నో సవాళ్లను అధిగమించి వంద కోట్ల డోసుల మైలురాయిని చేరుకున్నామని అన్నారు. వంద కోట్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే సాధ్యమైందని.. ఇది ప్రజల విజయమని అన్నారు.

    ప్ర‌తి ఒక్క‌రూ ఇప్ప‌టికీ క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించాల్సిందేన‌ని తెలిపారు. బయటకు వెళ్లినప్పుడు చెప్పులు ఎలా వేసుకుంటామో, అంతే సాధార‌ణంగా మాస్క్ కూడా ధ‌రించాల‌ని చెప్పారు. దేశ‌ ఆర్థిక వ్యవస్థ పట్ల దేశీయ నిపుణ‌ల‌తో పాటు విదేశీ నిపుణులు కూడా చాలా సానుకూలంగా ఉన్నారని ఆయ‌న తెలిపారు. ఇప్పుడు దేశానికి భారీగా పెట్టుబడులు వ‌స్తున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. దేశ‌ యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయ‌ని చెప్పుకొచ్చారు.

    కోవిన్‌ వల్ల టీకాలను సులభతరంగా, పారదర్శకంగా అందిస్తున్నామని తెలిపారు. వ్యాక్సిన్‌ సరఫరాను సవాల్‌గా తీసుకున్నామని.. అందరికి ఉచితంగా టీకా ఇచ్చామని స్పష్టం చేశారు. ప్రస్తుతం మేడిన్‌ ఇండియా వస్తువులకు ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. 100 కోట్ల డోసులు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు.. దేశ సామర్థ్యానికి ప్రతీక. మన దేశం ఎంత సంకల్ప బద్ధంగా ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుంది. భారత్‌ సాధించిన విజయాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని అన్నారు.

    Trending Stories

    Related Stories