More

    జూన్‌ 21 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌: మోదీ

    భారతప్రధాని నరేంద్ర మోదీ నేడు జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ ఉపద్రవం ఎదుర్కొంటామని అసలు ఊహించలేదని.. ఎంతో మంది మన ఆప్తులను ఈ మహమ్మారి కారణంగా పోగొట్టుకున్నామని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి అందరూ కలిసి పోరాడుతూ ఉన్నామని తెలిపారు. భారత్ లో సొంతంగా వ్యాక్సిన్ తయారు చేయకపోయి ఉండి ఉంటే ఎన్నో కష్టాలు వచ్చి ఉండేవని అన్నారు. మన దేశంలో వ్యాక్సిన్ సొంతంగా తయారు చేయడం వలనే ఇప్పుడు దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చోటు చేసుకుంటోందని అన్నారు. లేకపోతే మిగిలిన దేశాల్లో వ్యాక్సినేషన్ పూర్తయ్యాకనే… మన దేశంలో మొదలై ఉండేదని అన్నారు. భారత్ లో వ్యాక్సినేషన్ ఊపందుకుందని.. రాబోయే రోజుల్లో మరింత వేగంగా ముందుకెళుతుందని అన్నారు. భారత్ లో రెండు వ్యాక్సిన్లను తయారు రూపొందించారని.. పెద్ద పెద్ద దేశాలకు ఏ మాత్రం భారత్ తీసిపోలేదని అన్నారు. గతేడాది ఏప్రిల్ నెలలోనే వ్యాక్సిన్ కోసం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని అన్నారు.

    వ్యాక్సినేషన్‌ వేగవంతం చేసే సమయంలోనే రెండో వేవ్‌ వచ్చింది. కరోనాను ఎదురిస్తామనే విశ్వాసం అందరికీ ఉండాలని.. తక్కువ సమయంలోనే మన శాస్త్రవేత్తలు సఫలమయ్యారని అన్నారు. 23 కోట్ల మందికి ఇప్పటి వరకు వ్యాక్సినేషన్‌ వేశామని చెప్పుకొచ్చారు. వ్యాక్సిన్‌ తయారు చేసే సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నామని.. మౌలిక సదుపాయాలతోపాటు భారీగా నిధులు కూడా కేటాయిస్తామన్నారు. మరో 3 వ్యాక్సిన్ల ట్రయల్స్‌ తుదిదశలో ఉన్నాయని తెలిపారు.

    జూన్ 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కేంద్రమే ఉచితంగా టీకా పంపిణీ చేయనున్నట్టు మోదీ వెల్లడించారు. కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తుందని మోదీ ప్రకటించారు. వ్యాక్సిన్‌కు రాష్ట్రాలు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని.. వ్యాక్సినేషన్‌ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనన్నారు. వ్యాక్సినేషన్‌పై అనేకసార్లు సీఎంలతో మాట్లాడాడాని.. టీకా కొరతపై అనేక రాష్ట్రాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయని చెప్పారు. వ్యాక్సిన్ల కొరతపై రాష్ట్రాల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఉచిత టీకా వద్దనుకుంటే సొంతఖర్చుతో ప్రైవేటుగా టీకా వేయించుకోవచ్చని పేర్కొన్నారు. రూ.150 సర్వీస్ చార్జితో ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ పొందవచ్చని అన్నారు. వ్యాక్సిన్లలో 25 శాతాన్ని ప్రైవేటు రంగానికి అందుబాటులో ఉంచుతామని చెప్పారు. పేదలకు ఇబ్బంది కలగకుండా దీపావళి వరకు 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.

    Trending Stories

    Related Stories