More

    పోషకాహార లోపాన్ని తగ్గించే మోదీ రైస్..!

    పోషకాహార లోపం. ఈ పదం.. మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి వినిపిస్తూనేవుంది. పోషకాహార లోపంతో.. రక్తహీనత, వయసుకు తగిన బరువు లేకపోవడం, శరీరంలో నిస్సత్తువ, రోగనిరోధక శక్తి తక్కువగా వుండటం, ఎముకలు బలంగా లేకపోవడం.. వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా మహిళల్ని, పిల్లలను పోషకాహార లోపం దశాబ్దాలుగా వేధిస్తోంది. చాలామంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పేదవారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. పోషకాహార లోపంతో ఉన్న మహిళలకు పుట్టే పిల్లలు కూడా బలహీనంగానే ఉంటున్నారు. భారతదేశంలో రక్తహీనతతో బాధపడుతున్న 60 శాతం మంది స్కూలు పిల్లలు, 50 శాతం మంది గర్భిణులు ఉన్నారని ఇటీవల కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచంలో సగం రక్త హీనత కేసులు ఐరన్ లోపం వల్ల జరిగేవని, దీనివల్ల పిల్లల్లో 8 పాయింట్లు ఐక్యూ స్థాయిలు తగ్గుతాయని తెలిపింది. దేశంలో నానాటికి పోషకాహార లోపం పెరుగుతోంది తప్ప.. తగ్గడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. జనాభాలో 50 శాతం మంది అవసరమైన దాని కంటే కూడా తక్కువ స్థాయిలోనే ఐరన్ జింక్, విటమిన్ A, ఫోలేట్, ఇతర B విటమిన్లు తీసుకుంటారని నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ రిపోర్ట్ చెబుతోంది. రక్తహీనత కారణంగా ప్రతీ ఏటా స్థూల జాతీయ ఉత్పత్తిలో 1 శాతం అంటే.. లక్షా 35 వేల కోట్లు కోల్పోతున్నట్లు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ తెలిపింది. అందుకే, పోషకాహార లోపాన్ని దేశం నుంచి తరిమేసి, ఆరోగ్యభారతాన్ని నిర్మించేందుకు మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా, అధికారంలోకి రాగానే పోషకాహార లోపంపై దృష్టిసారించారు ప్రధాని మోదీ.

    ఒకప్పుడు మహిళలు ఇంటి పనులకు మాత్రమే పరిమితం కాకుండా.. వ్యవసాయ పనులు కూడా చేసేవారు. అయినప్పటికీ వారంతా ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అయితే నేటి మహిళలు కేవలం ఇంటి పనులకే అలసిపోతున్నారు. సాధారణంగా మహిళలు ఇంటి పనితోపాటు రకరకాలు పనులు చేస్తుంటారు. దీంతో వారికి ఎక్కువ మొత్తంలో శక్తి ఖర్చు అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో వీరికి బలవర్థకమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. మహిళలే కాదు, పిల్లలు, యువకులు సైతం కొద్దిపాటి పనులకు అలసిపోతున్నారు. 30 ఏళ్లకే రోగనిరోధక శక్తి లేక రోగాల బారిన పడతున్నారు. పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. దీనికి పరిష్కారంగా మోదీ సర్కారు ఫోర్టిఫికేషన్ రైస్‎.. అంటే, బలవర్ధకమైన బియ్యాన్ని తీసుకొస్తుంది. వీటిని ఇప్పుడు మోదీ రైస్ అని కూడా పిలుస్తున్నారు. గత నెల స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోటపై త్రివర్ణ పతకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ.. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ సంపూర్ణ వికాసానికి పోషకాహార లోపమే అతిపెద్ద అడ్డంకి అని అన్నారు. దేశంలో ఏ ఒక్కరు కూడా పోషకాహార లోపంతో బాధపడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్ దుకాణాల్లో పోషకాహార ధాన్యాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పోషకాహార లోపాన్ని నివారించడానికి ఫోర్టిఫికేషన్ రైస్ పంపిణీ చేస్తామని ప్రకటించారు. 2024 కల్లా ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకాల ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఫోర్టిఫైడ్ రైస్‎ను సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏమిటి..? వాటిని ఎలా తయారు చేస్తారు..? అన్న విషయాలపై సర్వత్రా ఆసక్తి పెరిగింది.

    పాలిష్ లేకుండా బియ్యాన్ని ఊహించని రోజులివి. అయితే పాలిష్ చేయడం వల్ల అందులో ఉండే ఖనిజాలు.. పోషకాలు పెద్దమొత్తంలో వెళ్లిపోతాయి. పాలిష్ చేసే క్రమంలో బియ్యంలో సహజంగా ఉండే విటమిన్ B 1, B 6, విటమిన్ E, నియాసిస్ తొలగిపోతాయి. కానీ, బియ్యం పాలిష్ చేయకపోతే అందులో మలినాలు ఉంటాయనేది కొందిరి వాదన. దీని వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతారు. ఈ సమస్యను నివారించడానికి పోర్టిఫికేషన్ రైస్‎ను పంపిణీ ఒక్కటే మార్గమని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. సాధారణంగా వరిని పండించడం ద్వారా బియ్యం వస్తాయి. వీటిని పాలిష్ చేసిన తర్వాత పంపిణీ చేస్తారు. దీంతో బియ్యంలోని పోషకాలు పోతాయి. అయితే, పోషకాలు పోకుండా వుండేందుకు బియ్యాన్ని పిండిచేసి అందులో ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్స్ ఆఫ్ ఇండియా ఆమోదించిన మోతాదులో విటమిన్లు, ఖనిజాలను కలిపి తిరిగి బియ్యపు గింజలుగా మారుస్తారు. ఈ ప్రక్రియను ఫోర్టిఫికేషన్ అంటారు. ఈ ప్రక్రియలో కోల్పోయిన పోషకాలతో పాటు మరి కొన్ని పోషకాలను కలపడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అలా తయారైన బియ్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్ అని పిలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోషకాహార లోపాన్ని నివారించడానికి బియ్యంతోపాటు ఇతర పప్పు ధాన్యాల్లో ఖనిజాలు, లవణాలను జత చేసే ప్రక్రియను ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆహార వ్యవసాయ సంస్థ ఇప్పటికే అమలు చేస్తున్నాయి.

    భారతదేశంలో 65 శాతం మంది జనాభాకు బియ్యమే ప్రధాన ఆహారం. బియ్యాన్ని ఎక్కువగా తినే దేశాల్లో ఉన్న పోషకాహార లోపాన్ని నివారించడానికి రైస్ ఫోర్టిఫికేషన్ చేయడమే సాంస్కృతికంగా అనువైన వ్యూహం అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా సూచిస్తోంది. మనదేశంలో ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేయడానికి హైదరాబాద్‎లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్‎లో పరిశోధన చేస్తోంది. ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేయడానికి 135 రోజులు పడుతుంది. హెక్టారుకు 50 క్వింటాళ్ల దిగుబడి రాగా బియ్యాన్ని పాలిష్ చేసిన తర్వాత కూడా అందులో జింక్ అధికంగా ఉంటుందని ఐసీఏఆర్ తెలిపింది. డీడీఆర్ ధన్-45 అనే వరి రకాన్ని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పండించవచ్చని చెబుతోంది. ఈ రాష్ట్రాల్లో ఈ రకం వరి పంటను పండించడం ద్వారా భారీ మొత్తంలో ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేయొచ్చని ఐసీఏఆర్ స్పష్టం చేస్తుంది.

    ప్రతీ కిలో ఫోర్టిఫైడ్ రైస్‎లో 28 మిల్లీ గ్రాముల ఇనుము, 75 నుంచి 125 మిల్లి గ్రాముల ఫోలిక్ యాసిడ్ ఉంటుందట. ఈ రైస్ తినడం వల్ల మహిళల్లో రక్తహీనత లోపం దూరమవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో ఈ రైస్ కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మహిళల్లో పౌషికాహార లోపాన్ని నివారించవచ్చని అంటున్నారు. ఈ రైస్ పంపిణీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు మోదీ సర్కారు సిద్ధమవుతోంది. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ దేశ ప్రజలకు ఈ రైస్‎నే ఇవ్వాలని భారీగా పండించేందుకు రెడీ అవుతోంది. దీని పరిశోధనలకు కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోంది. భారతదేశంలో ప్రజల ఆహార వినియోగానికి ఏటా ఒక మిలియన్ టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యం సరిపోతాయి. రైతులు ఈ బియ్యాన్ని ప్రత్యేకంగా పండించాల్సిన పనిలేదు. 99 శాతం రైతు పండించిన బియ్యాన్నే ప్రజలు తింటారు. అయితే, వీటిని దేశవ్యాప్తంగా సరఫరా చేయాలంటే, వీటి ఉత్పత్తిని 350 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశంలో పాలు, గోధుమ, ఉప్పు లాంటి వాటిని అదనపు పోషక విలువలను జత చేయడం మొదలయింది. అంతేకాదు, వరి, గోధుమ, జొన్న లాంటి ధాన్యాలను ఫోర్టిఫై చేయడం ఇప్పటికే 86 దేశాల్లో మొదలయింది. కోస్టారికా, నికరాగ్వా, పనామా, పాపువా న్యూ గినియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో ఫోర్టిఫైడ్ రైస్ వాడకాన్ని చట్టబద్ధం చేశారు కూడా. బ్రెజిల్, డొమినికన్ రిపబ్లిక్, కొలంబియా, దక్షిణ ఆఫ్రికా, అమెరికాలో స్వచ్చందంగా ఫోర్టిఫైడ్ రైస్ తయారీని చేపడుతున్నారు. భారత్ సైతం ఈ దిశగా ముందడుగు వేయడం ఆహ్వానించదగ్గ పరిణామం.

    Trending Stories

    Related Stories