మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. 150 మందిపై కేసులు

0
1030

ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం విషయంలో ఫిరోజ్ పూర్ పోలీసులు 150 మందిపై కేసులు నమోదు చేశారు. కుల్ గరి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఈ విషయాన్ని తెలుపుతూ, కేంద్రానికి పంజాబ్ ప్రభుత్వం నివేదిక పంపింది.

దేశ ప్రధాని కాన్వాయ్ వెళ్తున్నప్పుడు సదరు రాష్ట్ర డీజీపీతో మాట్లాడి భద్రతా ఏర్పాట్లు చేస్తారని, ఆయన క్లియరెన్స్ ఇచ్చినప్పుడే కాన్వాయ్ కదులుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పంజాబ్ డీజీ ఇన్ చార్జ్ అలాంటి హెచ్చరికలేవీ చేయలేదని, దాని ఫలితంగా అంతర్జాతీయ సమాజం తలదించుకునే ఘటన జరిగిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. పీఎం కాన్వాయ్ వెళ్లేటప్పుడు ముందు వార్నింగ్ కార్ బయల్దేరుతుందన్న తుషార్ మెహతా.. నిరసనకారులతో కలిసి అక్కడి పోలీసులు టీ తాగారని, ఆందోళనకారులు ఫ్లై ఓవర్ ను బ్లాక్ చేశారన్న విషయాన్ని వార్నింగ్ కారుకు ఆ పోలీసులు తెలియజేయలేదని సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. పంజాబ్ పర్యటనలో ప్రధానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలంటూ ‘సిక్స్ ఫర్ జస్టిస్’ సంస్థ పిలుపునిచ్చిందని, ఇది అంతర్జాతీయ ఉగ్రవాద చర్యగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వాదించారు. ఈ ఘటనను తేలిగ్గా రాష్ట్ర విచారణ కమిటీతో దర్యాప్తు చేయించకూడదని వాదించారు. న్యాయవిచారణ జరగకుండా ఉండాలనే రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీ వేసిందన్నారు. కచ్చితంగా ఎన్ఐఏ అధికారి సమక్షంలోనే విచారణ జరగాలన్నారు. అది జ్యుడీషియల్ కమిషన్ అయినా, రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ అయినా ప్రధాని పర్యటనలో భద్రతా లోపాలకు సంబంధించి అన్ని విషయాలనూ సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిందేనని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఆ లోపాలపై ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) ఐజీ పర్యవేక్షణ చేస్తున్నారని తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ప్రధాని పంజాబ్ పర్యటనకు సంబంధించిన అన్ని రికార్డులను జాగ్రత్త పరచాలంటూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. భద్రతా లోపాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ నిర్వహించింది. ఈ కేసులో సోమవారం తదుపరి విచారణ వరకు కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఎటువంటి విచారణ చేపట్టవద్దని ఆదేశించింది. ప్రధానికి రక్షణ కల్పించడం జాతి భద్రతకు సంబంధించిన విషయం. ఇది పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ఈ కేసులో వృత్తిపరమైన నిపుణులు దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందని న్యాయవాది మణీందర్ సింగ్ వాదనలు వినిపించారు. దీంతో ప్రధాని పర్యటనకు సంబంధించిన అన్ని రికార్డులు జాగ్రత్త పరచాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను ఆదేశించింది. ప్రధాని పర్యటన తాలూకు వైర్ లెస్ సందేశాలు, తదితర సాక్ష్యాల సేకరణ విషయంలో రిజిస్ట్రార్ జనరల్ కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి ఒక అధికారి సహకారం అందించాలని సూచించింది.