పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో వివాదానికి కేంద్ర బిందువయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను కోవిద్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై నుండి తీసి వేయించి.. తన బొమ్మను వేయించుకున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇస్తున్న సర్టిఫికేట్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫొటో ఉంటుండగా.. పశ్చిమ బెంగాల్‌లో టీకా సర్టిఫికేట్‌పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫొటోను ప్రచురిస్తున్నారు. మోదీ ఫొటోను తొలగించి మరీ అదే స్థానంలో మమతా బెనర్జీ ఫొటోను ముద్రించడం వివాదాస్పదమవుతోంది. సర్టిఫికేట్లపై మమత ఫొటోను ప్రచురించడంలో తప్పు లేదని మంత్రి ఫిర్హాద్ హకీమ్ చెప్పుకొచ్చారు. అయితే కొన్ని రోజుల క్రితం టీకా సర్టిఫికేట్‌లో మోదీ ఫొటో ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది టీఎంసీ. అప్పట్లో ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసి, ఎన్నికల నియమావళిని బీజేపీ ఉల్లంఘించిందని ఆరోపణలు చేసింది. ఎన్నికలు ముగిశాక ఇప్పుడు మోదీ ఫొటోను తీసేసి మమతా ఫొటోను ముద్రిస్తోంది.
మమతా బెనర్జీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధాని ఫోటో విషయంలో కూడా రాజకీయం చేయడం మమతా అండ్ కో కు మాత్రమే చెల్లిందని విమర్శిస్తూ ఉన్నారు. మన పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానమంత్రికి ప్రత్యేక స్థానం ఉందని.. ఆ స్థానాన్ని సీఎం పరం చేయాలని టీఎంసీ భావిస్తోందని బీజేపీ నేత సామిక్ భట్టాచార్య విమర్శించారు. ఛత్తీస్ఘర్ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో ప్రధాని ఫోటోను తీసి వేసింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ‘భూపేష్ భగేల్’ ఫోటోను సర్టిఫికేట్ పై ముద్రించారు.
యాస్ తుఫాను సమయంలో సమీక్ష నిర్వహించిన సమయంలో కూడా మమతా బెనర్జీ ప్రవర్తించిన తీరు పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. యాస్ తుఫాన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించగా ఆ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత 30 నిమిషాలు ఆలస్యంగా మమతా అక్కడి వచ్చారు. మోదీ, పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధనఖర్ పాల్గొన్న సమీక్ష సమావేశానికి అరగంట ఆలస్యంగా వచ్చిన మమతా బెనర్జీ రాష్ట్రంలో తుఫాను నష్టంపై పత్రాలను అందజేసి ఇతర సమావేశాల కోసం వెళ్లిపోయారు. ఆమె వ్యవహరించిన తీరు అత్యంత వివాదాస్పదమైంది. మమతా ముందుగా నిర్ణయించిన సమయానికి రాకుండా ప్రధాని మోదీ ఎదురుచూసేలా ప్రవర్తించారు. సమావేశానికి అనుకున్న సమయానికన్నా ఆలస్యంగా వచ్చిన మమతా తుపాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక నివేదికను మోదీకి అందించి బయటకు వెళ్లిపోయారు. ఇక్కడ కూడా రాజకీయాలను చేయడం కేవలం మమతా బెనర్జీకే చెల్లిందని విమర్శల వర్షం కురిసింది. ఇప్పుడు సర్టిఫికెట్లలో మోదీ బొమ్మను తీసివేయించి కూడా అదే తరహాలో ప్రవర్తించారు.